సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (17:49 IST)

ఏపీ సర్కారుపై కేంద్రం ప్రశంసలు.. తెలంగాణ కూడా అభినందన

malaria
ఏపీ సర్కారుపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. మలేరియా నిర్మూలనకు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి పురస్కారం అందజేయనుంది. ఢిల్లీలో ఇవాళ జరిగే కార్యక్రమంలో ప్రభుత్వానికి పురస్కారం అందించనుంది. 
 
అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మలేరియా నివారణ చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ప్రభుత్వ కృషిని గుర్తించి తెలంగాణను కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1లో చేర్చింది. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మలేరియా నివారణకు చేపట్టిన చర్యలకు గాను ఇవాళ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో సత్కరించనుంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
 
ఇకపోతే.. ఏపీలో 2018లో 6040 మలేరియా కేసులు నమోదవగా... 2021 నాటికి ఆ సంఖ్య 1,139కి తగ్గింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనే విషయాన్ని గుర్తు చేసింది. 
 
అలాగే, దోమల నిర్మూలనకు ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రేయింగ్‌ను చేపట్టింది. ఫ్రైడే డ్రైడే పేరిట అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దోమల కట్టడి, మలేరియాను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందుకోసం ఆరోగ్య పరిరక్షణ యాప్‌ను తీసుకొచ్చింది. దోమల నివారణ కోసం 24 లక్షల గంబూజియా చేపలను మత్స్యకారులకు పంపిణీ చేసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం 117 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయి.