పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి జగన్ సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేశారు.
స్వామివారిని దర్శించుకున్న సీఎం జగన్, కల్యాణ వేదిక వద్దకు తరలివెళ్లనున్నారు. తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహిస్తున్నారు.
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా రామూలోరి కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ కు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఇక రెండు రాష్ట్రాలు విడిపోక ముందు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగేవి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణం శ్రీరామ నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు జరిపిస్తారు.