బుధవారం, 29 మార్చి 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (21:23 IST)

ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కల్యాణం

ఏప్రిల్ 15వ తేదీన ఒంటిమిట్ట రామయ్య కల్యాణం జరుగనుంది. సీఎం జగన్ కల్యాణ వేడుకకు హాజరు కానున్నారు. ప్రభుత్వ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. అనంతరం కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వైవీ సుబ్బారెడ్డికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు.  
 
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు, స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాముల వారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరు కావచ్చునని అంచనా వేసినట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
 
కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈసారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.