సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (19:35 IST)

మయసభను చూసి దుర్యోధనుడికి అసూయ కలిగనట్టు.. జగన్‌కు?

మయసభను చూసి దుర్యోధనుడికి అసూయ కలిగినట్టుగా, అమరావతిని చూస్తే వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఏర్పడిందని.. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శించారు.

అమరావతిని చూస్తుంటే జగన్‌కు చంద్రబాబే గుర్తుకొస్తున్నారని.. దీనిని భరించలేకే రాజధాని మార్పుకు కంకణం కట్టుకున్నారని యనమల ఫైర్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నుకున్నంత మాత్రాన రాజధానిని మార్చే హక్కు ఆయనకు లేదన్నారు. అమరావతిలో రాజధాని వుండకూడదని జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
 
శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రులు ఎలా ప్రవర్తించారో ఫొటోలు, దృశ్యాలు చూస్తే తెలుస్తుందని యనమల విమర్శించారు. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించే అధికారం అధికారపక్షానికి గానీ ప్రతిపక్షానికి గానీ లేవు కానీ, సమీక్షించమని విజ్ఞప్తి చేసుకోవచ్చని తెలిపారు. అధికారపక్ష సభ్యులు ఆవిధంగా చేయకపోగా చైర్మన్ పై దాదాపు దాడి చేసినంత పని చేశారని ఆరోపించారు. 
 
సభ వాయిదా పడ్డ తర్వాత చైర్మన్ తన ఛాంబర్ లోకి వెళ్లారని, అక్కడి నుంచి కారు ఎక్కేందుకు వెళ్లేందుకు ఉపక్రమిస్తున్న సమయంలో ఆయనను గదిలో పెట్టి కొట్టేందుకు కొంతమంది యత్నించారని ఆరోపించారు. తన ఛాంబర్ డోర్ తీసుకుని బయటకు వస్తుంటే, బలవంతంగా ఆ డోర్ ని మళ్లీ మూసేసి దాడి చేయాలని చూశారని, ఈలోగా మార్షల్స్ వచ్చి అక్కడి నుంచి చైర్మన్‌ను తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. 
 
రూల్ 154 ప్రకారం చైర్మన్ నిర్ణయం తీసుకుని సెలెక్ట్ కమిటీకి పంపారని, చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించేందుకు వీళ్లెవరు? అని ప్రశ్నించారు. చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని, సీఎం జగన్ కు రూల్స్ తెలియవని, ఆయనకు ఎవరూ చెప్పరని యనమల విమర్శించారు.