గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (22:03 IST)

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు.. నజారానా సంగతేంటి?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. 'గ్రామాల్లో శాంతియుత, వాతావరణం నెలకొనాలి, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పాలి. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉంది? 
 
ఆ ప్రక్రియను తప్పుబట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదు? అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదు? అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏకగ్రీవాలు ఎక్కువ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడమే రాజకీయం కాదా? అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారు' అని ప్రశ్నించారు.
 
'పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏంటి? పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలంటూ... నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా? ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని ఆయన ఒక ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోంది. 
 
పార్టీలకు సంబంధంలేని ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దురుద్దేశాలను అంటగట్టేలా మాట్లాడడం దేనికి నిదర్శనం? ఏకగ్రీవ ఎన్నికలకు నజారానా ఇస్తూ, దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలను జీవోల ఆధారంగా స్పష్టంచేస్తూ ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రకటనను తప్పుబట్టడం కూడా నిమ్మగడ్డ రాజకీయాల్లో భాగం కాదా?' అని ప్రశ్నించారు.