గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (12:53 IST)

'అన్నా రాంబాబు గుర్తించుకో.. అధఃపాతాళానికి తొక్కేస్తాం' : పవన్ వార్నింగ్

ఏపీలో అధికార వైకాపాకు చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నించారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆయన ఆరోపించారు. 
 
వైసీపీ నేతలు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలని.. వారి వైఖరి ఎలా ఉందో అని అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను ఛిద్రం చేయాలనుకుంటే కుదరదని అన్నారు. దాష్టీకాలు ఎక్కువవుతుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు. 
 
'జగన్ రెడ్డిగారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా.. మీకు ఆ ధైర్యం ఉందా.. అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను అద:పాతాళానికి తొక్కేస్తాం' అంటూ హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంగయ్య మృతి వైసీపీ పతనానికి నాంది అని స్పష్టం చేశారు. 
 
'ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మీ చానెల్స్‌లో వేసుకోండి.. తమ పేపర్స్‌లో రాసుకోండి.. మీరు జర్నలిస్టులను కూడా వదలటం లేదు.. మీరు అనుకున్న వాళ్లే జర్నలిస్టులా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.. ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో ఉన్నామా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి' అని పవన్ ప్రశ్నించారు. 
 
ఆ తర్వాత ఒంగోలులో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేశారు. ఘటనతో పాటు అనంతర పరిణామాలను ఎస్పీకి వెంగయ్య కుటుంబ సభ్యులు వివరించారు. 
 
అంతకుముందు ఉదయం జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 18న బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున 8.50 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.