గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 23 జనవరి 2021 (19:55 IST)

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ‘పంచాయితీ’: ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కి దూరంగా అధికారులు, హైకోర్టులో వైసీపీ పిటిషన్

పంచాయితీ ఎన్నికల విషయంల ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఎస్ ఈ సీ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. వాక్సినేషన్ వ్యవహారాల మూలంగా ఈ సమావేశానికి హాజరు కాలేమని తొలుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ ఈ సీ కి సమాచారం ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ విడుదలయినందున వాక్సినేషన్ సహా అన్ని అంశాలు వీడియో కాన్ఫరెన్సు వేదికగా చర్చిద్దామంటూ ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. సమావేశానికి హాజరుకావాలని కోరారు.

 
మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎస్, డీజీపీ, పంచాయితీరాజ్ ఉన్నతాధికారులు కూడా గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభమయ్యి గంట గడుస్తున్నా ఎస్ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారు. దాంతో సాయంత్రం 5గంటల వరకూ వేచి చూస్తామని ఎస్ ఈ సీ ప్రకటించారు. దాంతో ప్రభుత్వం తరుపున తొలుత సీఎస్ లేఖలో పేర్కొనట్టుగా సుప్రీంకోర్ట్ ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడాలనే అంశంలో కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది.

 
‘వాక్సినేషన్ లేదా ఎన్నికలు ..ఏదోటి మాత్రమే సాధ్యం’
మరోవైపు వైసీపీ నేతలు ఎస్ఈసీ తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినట్టు చెబుతున్నప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయిన తర్వాత ఎక్కడా జరగలేదని ఆపార్టీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడాలంటే నిమ్మగడ్డకి ఎందుకు తొందర.. 2018లో పదవీకాలం ముగిసినా అప్పట్లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. కరోనా కేసులు స్వల్పంగా ఉన్న సమయంలో పూర్తి చేయకుండా ఇప్పుడు ఆతృత ఎందుకు. వ్యాక్సినేషన్ గానీ ఎన్నికలు గానీ ఏదోటి మాత్రమే సాధ్యమవుతుంది. సుప్రీంకోర్టు ఏది జరపమంటే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండూ జరగాలంటే సాధ్యం కాదు. వ్యాక్సినేషన్ జరిగితే కరోనా నియంత్రణ జరుగుతుంది. ఎన్నికలు జరిగితే కరోనా కేసులు పెరుగుతాయి. అయినా న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తాం’’ అన్నారు.

 
‘మూడున్నర లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు..’
హడావిడిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం వల్ల యువ ఓటర్లకు ఓటు హక్కు లేకుండా పోతోందని వైసీపీ లీగల్ సెల్ అభిప్రాయపడుతోంది. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరబోతున్నట్టు లీగల్ సెల్ ఓ మీడియా ప్రకటనలో తెలిపింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, దాని వల్ల సుమారు. 3.6 లక్షల మంది కి ప్రాధమిక హక్కు లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. దీనిపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేస్తున్నట్టు వెల్లడించారు.

 
తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిపేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు కమిషన్ భావిస్తోందని తెలిపారు. విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తాం. ఎన్నికలు సజావుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సహకరించకపోతే గవర్నర్‌కు, సుప్రీం కోర్టుకు నివేదించాల్సి ఉంటుంది. ఉద్యోగులు కూడా దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో కుదరదని అనడం సరికాదు" అని నిమ్మగడ్డ అన్నారు.

 
తాము కూడా ప్రజాసేవకులమేనని గుర్తించాలని, నిధుల సమస్యతో ఉన్న ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాలని కూడా ఆయన కోరారు. ఎన్నికల కమిషనర్ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. 3.5 లక్షల మంది యువ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులే బాధ్యత వహించాలి. "వారిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి" అని రమేశ్ కుమార్ అన్నారు. ఎన్నికల నిర్వహణలో గవర్నర్ తోడ్పాటు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన కమిషనర్, శుక్రవారం నాటి ప్రభుత్వ లేఖ తనకు అందడానికి ముందే మీడియాకు చేరడం గురించి ప్రస్తావించారు. సీఎస్, ఎస్ఈసీ మధ్య గోప్యత పాటించాలని కూడా ఆయన చెప్పారు.

 
శుక్రవారం సీఎస్ రాసిన లేఖలో ఏముంది...
రాష్ట్రంలో పోలీసులు, రెవెన్యూ సహా పోలింగ్ సిబ్బందికి మొదటి దశలో టీకా వేసిన 60 రోజుల తర్వాత పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వేవేది, కమిషనర్ గిరిజా శంకర్ తీసుకెళ్ళి ఎస్ఈసీకి అందించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ తేల్చిచెప్చేశారు.

 
పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఒకేసారి జరగాలంటే వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఎస్‌ఈసీ తన నిర్ణయంపై పునఃపరిశీలించాలని సీఎస్ విన్నవించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన కోరారు.

 
అంతేకాకుండా గత ఏడాది స్థానిక ఎన్నికల సందర్భంగా కొందరు అధికారులు నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిని విధుల నుంచి తొలగించాలని ఎస్‌ఈసీ రాసిన లేఖకి అనుగుణంగా చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, విపత్తు వేళ విధులు సమర్థవంతంగా నిర్వహించిన వారిని తొలగించడం సాధ్యం కాదన్నారు. ఎస్‌ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. కరోనా మొదటి డోస్‌ తీసుకున్న వారికి రెండోడోస్‌ ఇచ్చిన నాలుగు వారాలకు ఇమ్యూనిటీ వస్తుందని గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను మనస్ఫూర్తిగా పాటించేందుకు ఎస్‌ఈసీ, ప్రభుత్వం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.

 
తాజా లేఖలో ఎస్‌ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో ఉన్నాయని తెలిపారు. ‌సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని ఎస్‌ఈసీని కోరారు. తీర్పు వచ్చే వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.దాంతో ఈ పరిణామాలు రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగాలేదని సీఎస్ స్పష్టం చేయగా, ఎన్నికల నోటిఫికేషన్ కి సర్వత్రా సిద్ధం చేసి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిన్నటి నుంచే అమలులో ఉందని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిబంధనావళి జారీ చేశారు.

 
సుప్రీంకోర్టులో సోమవారం విచారణ..
మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ లిస్ట్ అయ్యింది. సోమవారం విచారణకు రాబోతోంది. సోమవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ఈ కేసుని విచారించబోతోంది. ఏపీలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా పంచాయితీ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఏపీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పు ని నిలిపివేయాలని కోరుతోంది.

 
శుక్రవారం ఉదయం నుంచి ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేరకు సహకారం అందుతుందనే విషయంలో స్పష్టత కనిపించడం లేదు. శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.

 
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి జనవరి 9న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. అందులో భాగంగా 4 విడతల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. అయితే దానిని ఏపీ ప్రభుత్వం కోర్టులో సవాల్ చేయడంతో ఏపీ హైకోర్టు ఎస్ఈసీ నోటిఫికేషన్ కొట్టేసింది. ఆ తర్వాత ఎస్ఈసీ దానిని ద్విసభ్య బెంచ్ కి రిట్ ఫిటీషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీ వాదనను అంగీకరిస్తూ వాక్సినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల నిర్వహణ కూడా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏపీ గవర్నర్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పంచాయితీరాజ్ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 10గం.లకు సీఎంవోలో సమావేశం పేరుతో అధికారులు హాజరుకాలేకపోతున్నట్టు సమాచారం అందించారు.

 
ఆ తర్వాత మధ్యాహ్నం 3గం.ల ప్రాంతంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ మరోసారి గైర్హాజరు కావడంతో ఎస్ఈసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌ కి మొమో జారీ చేశారు. సమావేశాన్ని సాయంత్రం 5గం.ల ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సాయంత్రం 6గంటల వరకూ సమావేశం జరగలేదు. అదే సమయంలో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదితో పాటుగా కమిషనర్ గిరిజా శంకర్ సమావేశమయ్యారు. ఎస్ఈసీ సమావేశానికి సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. తొలుత ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత సీఎస్ తో సమావేశం కావడంతో ఎస్ఈసీతో భేటీ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం కొనసాగుతోంది.

 
మరోవైపు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో పాటుగా ఏపీ డీజీపీకి ఎస్‍ఈసీ లేఖ రాశారు. గత మార్చిలో తీసుకున్న చర్యకు అనుగుణంగా తొమ్మిది మంది అధికారులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని ఎస్ఈసీ కోరింది. వారిలో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటుగా తిరుపతి అర్బన్ ఎస్పీ కూడా ఉన్నారు. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలతో పాటుగా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని ఎస్ ఈ సీ లేఖలో పేర్కొన్నారు.

 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోం మంత్రి సుచరిత, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి కీలక నేతలు పాల్గొన్నారు. దాంతో ఇటు ప్రభుత్వం, ఇటు ఎస్ఈసీ మధ్య వివాదంగా మారిన వ్యవహారం ఆసక్తిగా కనిపిస్తోంది. అంతకుముందు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ సక్రమంగా లేదంటూ సుప్రీంకోర్ట్ విచారణకు తిరస్కరించింది. వాటిని సరిదిద్ది మళ్లీ పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. దాంతో సోమవారం వరకూ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఈ పరిణామాలన్నీ పెద్ద చర్చకు ఆస్కారమిస్తున్నాయి.