శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రియుడు దక్కలేదనీ... అతని భార్యపై ప్రియురాలు దాడి

అనంతపురం జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. తాను ప్రేమించిన యువకుడు మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన ఓ యువతి... అతని భార్యపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఈ ఘటన అనంతపురం జల్లా కేంద్రంలో సంచలనం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇతడిని చాలాకాలంగా ప్రేమిస్తోంది. కానీ ఈ విషయం శ్రీనివాసులకు ఆమె ఎప్పుడూ చెప్పలేదు. 
 
ఈ క్రమంలో శ్రీనివాసులు, మహేశ్వరి (19) అనే మరో యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికిగురైంది. తనకు దక్కాల్సిన శ్రీనివాసులును మహేశ్వరి దక్కించుకుందని ఆగ్రహంతో రగిలిపోయింది. 
 
పైగా, ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించుకుంటే శ్రీనివాసులు తనవాడైపోతాడని భావించింది. ఈ క్రమంలో శనివారం మహేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెతో వాగ్వాదానికి దిగింది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయింది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు హుటాహుటిన మహేశ్వరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.