శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (08:00 IST)

"విశాఖ ఉక్కు"పై అధికారం లేదు.. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ : సీఎం జగన్

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, అస్సలు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానిదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, అందరూ కోరుతున్నట్లుగానే ప్రతిపక్షంతో కలిసి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. 
 
వైజాగ్‌లో సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో పోస్కో బృందం తనను కలిసిన మాట వాస్తవమేనని జగన్‌ అంగీకరించారు. అయితే తాను కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని కోరగా.. వారు పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. తాజాగా ఆ బృందం కృష్ణపట్నం సందర్శనకు వెళ్లిందన్నారు. వారు భావనపాడు కూడా చూస్తున్నారని.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుచేసే ఆలోచన వారికుందని తెలిపారు. 
 
ఇకపోతే, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కార్మిక నాయకులు కోరారు. గతంలో కొన్ని బ్లాకులు కేటాయించారని, వాటిని రెన్యువల్‌ చేయాల్సి ఉందని, ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. 
 
ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో విలీనం చేయాలని ఇంకొందరు..  పోస్కోను విశాఖలో అడుగుపెట్టనివ్వొద్దని మరికొందరు కోరారు. అయితే, విశాఖ కర్మాగారానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. నిరుపయోగంగా ఉన్న భూములను లేఅవుట్లుగా వేసి విక్రయించాలి. అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. వాటిని ప్లాంట్‌లో పెట్టుబడులుగా పెడితే సమస్యలన్నీ తీరిపోతాయని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. 
 
ఈ భూములపైనా కేంద్రానికే హక్కులు ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే.. రాష్ట్రప్రభుత్వం తరపున ల్యాండ్‌ కన్వర్షన్‌కు సహకరిస్తామన్నారు. అఖిలపక్షం నాయకులతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తారని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి వీలైనంతవరకు సహకరిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.