సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:30 IST)

హత్య జరిగిన రెండేళ్లైనా అతిగతీ లేదు..: వైఎస్ వివేకా కుమార్తె ఆవేదన

తన తండ్రి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి కోరారు. ఢిల్లీలో సీబీఐ అధికారులను శుక్రవారం ఆమె కలిశారు. 
 
ఆ తర్వాత ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని కలిస్తే.. కడప, కర్నూల్‌లో ఇలాంటి ఘటనలు సాధారణం అన్నారు. అయ్యిందేదో.. అయ్యింది.. నీ పోరాటం ఆపేయి.. లేదంటే నీ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొంతమంది బెదిరిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఏది సరైందన్న ఆలోచనలో పడ్డాను. నా పిల్లల గురించి ఆలోచిస్తూ స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అనిపించింది. 
 
నేను రాజకీయవేత్తను ... సామాజిక కార్యకర్తను కాదు. మానాన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అంతటి వ్యక్తికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. విచారణ ఆలస్యమైతే.. రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారు. న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలి’’ అని ఆమె ప్రశ్నించారు. 
 
హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదు. హత్యపై ఓ ఉన్నతాధికారిని అడిగితే కడప, కర్నూలులో ఇలాంటివి సహజం అని బదులిచ్చారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్యను మామూలుగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మాకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? న్యాయం కోసం ఇంకెంతకాలం వెయిట్‌ చేయాలి అని అడిగారు. 
 
ఈ అన్యాయంపై పోరాటంలో నాకు అందరి సహకారం కావాలి. హత్య వెనుక ఎవరున్నారో విచారణ అధికారులు నిగ్గుతేల్చాలి. నాన్న హత్య మా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ కేసులో ఒక్కరినీ అరెస్ట్‌ చేయకపోవడం విచారణపై సందేహం కలుగుతోంది. నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హంతకులను ఇంతవరకూ పట్టుకోకపోవడం ఆందోళనకరంగా ఉంది. 
 
ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళ్లినా ఇంకా ఎలాంటి పురోగతి లేకపోవడం విచారకరం. సాక్ష్యాలు ఎక్కడ తారుమారు అవుతాయోననే సందేహం కలుగుతోంది. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. నాన్న హత్య మిస్టరీగానే మిగిలిపోయింది. హత్యపై ఓ ఉన్నతాధికారిని అడిగితే... కడప, కర్నూలులో ఇలాంటివి సహజం అని బదులిచ్చారు. హత్యకు రాజకీయ కారణాలు ఉండొచ్చని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.