డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న ఫేస్‌బుక్.. బొమ్మ కనిపిస్తే చాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఫేస్‌బుక్ వదిలిపెట్టేలా లేదు. కేపిటల్ హిల్ సంఘటనలో అల్లరి మూకలను ట్రంప్ ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడంతో ఆయనపై ఫేస్‌బుక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లను ట్రంప్ ప్రోత్సహించినట్లు గుర్తించడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, యూట్యూబ్ ట్రంప్‌ను తమ వేదికలను వాడుకోకుండా నిషేధించాయి. ఈ నిషేధాన్ని ఉపసంహరించే ఆలోచన ఏదీ లేదని ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ సాండ్‌బెర్గ్ చెప్పారు.
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను వాడుకోనీయకుండా.. ట్రంప్‌కు చుక్కలు చూపిస్తోంది. ఆ వేదికను ఏదో ఒక విధంగా వాడుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తుంటే, అలాంటి ప్రయత్నాన్ని పసిగట్టిన వెంటనే ఫేస్‌బుక్ తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా ట్రంప్ తన కోడలి ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్షమవగానే, ఆ వీడియోలను ఫేస్‌బుక్ తొలగించి, హెచ్చరించింది.
డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడు ఎరిక్ ట్రంప్ సతీమణి లారా ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేయించారు. ట్రంప్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియోను లారా ట్రంప్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వెంటనే ఆమెకు ఫేస్‌బుక్ నుంచి ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ వాయిస్ ఉన్నందువల్ల దీనిని తొలగించినట్లు తెలిపింది. ఇటువంటి వీడియోలను పోస్ట్ చేస్తే అదనపు ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించింది.