శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (17:24 IST)

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి... రాష్ట్రాభివృద్ధి కోసం 9 అంశాలు

త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా పార్లమెంట్ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. ఇందులో వైకాపా తరపున ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా వారు ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీలు.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధానమైన 9 అంశాలను లేవనెత్తారు. రెవెన్యూ లోటు బకాయిలు రూ.18,969 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. 
 
అలాగే, నవ్యాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు రూ.23 వేల కోట్లను అడిగిన ఎంపీలు... పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్రం తక్షణం రీఎంబర్స్‌ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 
 
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను ఆమోదించాలని.. రాజధాని నగరం అభివృద్ధి కోసం గ్రాంట్‌గా రూ.47,424 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ఇలా మొత్తం 9 అంశాలతో కూడిన అభివృద్ధి అజెండాతో జాబితాను అందజేశారు.