బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (12:36 IST)

నిన్ను లేపేస్తా.. నీ ఆఫీస్ లేకుండా చేస్తా! : భర్త, కొడుకుతో కలిసి చితకబాదిన వైనం

Boy Attacked
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 47వ డివిజన్‌కు చెందిన జనసేన కార్యకర్తపై.. వైసీపీ కార్పొరేటర్ గోదావరి గంగ దౌర్జన్యం చేసి ఆమె భర్త బాబు, కొడుకుతో కలిసి దాడికి దిగింది. ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగంగా డివిజన్‌లో నీ ఆఫీస్‌ను, నిన్నూ లేకుండా చేస్తా'నంటూ బెదిరించింది. 
 
ఇటీవల చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కార్పొరేటర్ భర్త గోదావరి బాబు.. ముఖానికి క్లాత్ కట్టుకొని ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.20 వేల నగదు దొంగిలిస్తుండగా బాధితుడు పట్టుకున్నాడు. బాబును చితకబాది పోలీసులకు అప్పగించాడు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం తిరువూరులో జరుగుతున్న టీడీపీ 'రా కదిలిరా' సభ ప్రాంగణంలో గోదావరి బాబు కనిపించడంతో.. '47వ డివిజన్ కార్పొరేటర్ భర్త గోదావరి బాబు సభలో ఉన్నాడు. జనసేన, టీడీపీ కార్యకర్తలు నాయకులు మీ విలువైన వస్తువులు, బంగారం, జేబులో డబ్బులు జాగ్రత్తగా దాచుకోండి' అంటూ జనసేన కార్య కర్త గౌరీశంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 
 
అది వైరల్ కావడంతో ఆగ్రహించిన కార్పొరేటర్ గోదావరి గంగ, ఆమె భర్త బాబు.. గౌరీశంకర్‌కు ఫోన్ చేశారు. 'నీతో మాట్లాడాలి.. కలరా హాస్పటల్ వద్దకు రా' అని చెప్పారు. అక్కడికి వెళ్లిన గౌరీశంకర్‌పై కార్పొరేటర్ గంగ, ఆమె భర్త బాబు, కొడుకు బూతు పురాణం అందుకున్నారు. 'మా గురించి ఎందుకు పోస్ట్ పెట్టావు, మా వృత్తి మమ్మల్ని చేసుకోనివ్వవా అంటూ గౌరీశంకర్‌ను కిందపడేసి గోదావరి గంగ కాళ్లతో తన్నగా.. బాబు ఆయన, కొడుకు అక్కడే అరటిపండ్ల బండి వద్ద ఉన్న బ్యాటరీ లైట్‌తో, త్రాసుతో విచక్షణ రహితంగా తలపై, పొట్టపై రక్తపు గాయాలయ్యేలా తీవ్రంగా గాయపర్చారు. 
 
అక్కడి నుంచి తప్పించుకుని రక్తపు గాయాలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న గౌరీశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేందుకు ప్రయత్నించారని, రాడ్డు, కత్తితో దాడి చేసి గాయపర్చారని నిందితులపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, లేకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని తెలిపారు. బాధితుడిని పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ కలిశారు. వివరాలు తెలుసుకొని కమిషనర్‌తోనూ, సీఐతోనూ మాట్లాడారు. 
 
అధికార వైసీపీ ఈ విధంగా జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని, ఎన్నో దొంగతనాల కేసులున్నా పోలీసులు సైతం అధికార పార్టీ కార్పొరేటర్ కావడంతో పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బాధితుడికి న్యాయం జరగక పోతే తీవ్రస్థాయిలో అందోళనలు చేస్తామని హెచ్చరించారు.