శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (20:13 IST)

ఈ ముఖ్యమంత్రి ఓ రంగుల పిచ్చోడు : టీడీపీ చీఫ్ చంద్రబాబు

chandrababu
తిరువూరులో 'రా కదలిరా' బహిరంగ సభకి హాజరైన అశేష ప్రజానీకంను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం రావాలి, సైకో జగన్ ప్రభుత్వం పోవాలి అనే లక్ష్యంగా ప్రజలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి- ప్రజాసంక్షేమం తన బాధ్యత అని భరోసా ఇచ్చారు.
 
"మూడు ముక్కలాట ఆడిన జగన్ పాలన ఇంకో మూడు నెలలే. ఈ మోసగాళ్లకు మూడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని  అమరావతి గురించి గర్వంగా చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఇది తథ్యం!. వీళ్ళ చెల్లి వెనుక కూడా ఉన్నది నేనే అంట.. ఆ రోజు పాదయాత్ర కూడా నేనే చేయమన్నా మరి...
 
నేనెవరో ఈ ప్రపంచానికి బాగా తెలుసు. గత ఎన్నికలప్పుడు బాబాయ్ కి అంతిమయాత్ర ప్లాన్ చేసి అధికారంలోకి వచ్చాను. అందుకే వచ్చే ఎన్నికలు నా పాలనకు అంతిమయాత్ర కాబోతున్నాయి. మాయ మాటలు చెప్పే 'ఓ దొంగోడి కథ' - అర్థమైందా రాజా!? అని అన్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన 'రా కదలిరా' సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు.
 
"అంబటి రాయుడు... ఓ క్రికెటర్. గుంటూరు జిల్లాకు చెందినవాడు. రాయుడు ఆశపడడంలో తప్పులేదు. కానీ జగన్ మాయగాడు. రాయుడ్ని నమ్మించి మోసం చేశాడు. రాయుడ్ని మాయ చేశాడు. నీకు గుంటూరు పార్లమెంటు స్థానం ఇచ్చేస్తాం... పోయి పని చేసుకో అని నమ్మబలికాడు. 
 
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం నీకిచ్చేస్తా అన్నాడు. ఆ పేరు నేను చెప్పను. దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది. ఆయన నైజం ఏంటో గుర్తించాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని తెలుసుకుని... ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడు" అంటూ చంద్రబాబు వివరించారు. 
 
సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు అని అభివర్ణించారు. ఎక్కడ ఏది చూసినా ఆయనకు ఆ రంగు వేసేయాలి, ఆయన ఫొటో వేయాలి అని ఎద్దేవా చేశారు.
 
"మేం టిడ్కో ఇళ్లు కడితే దానికి వీళ్లు రంగేసుకున్నారు. దానికి ఆయన ఫొటో, ఆయన పేరు... ఇదెక్కడి అన్యాయమో నాకు కావడంలేదు. సర్వే అని చెప్పి ఆఖరికి మీ పొలం రాళ్లపైనా కూడా తన బొమ్మ వేసుకున్నాడు. పొలాల్లో రాళ్లపైనా, పట్టాదారు పాస్ పుస్తకంపైనా తన బొమ్మ వేశాడు. ఈయన మీ అమ్మ తరఫున చుట్టమా? లేక, మీ నాన్న తరఫున చుట్టమా? మీ దూరపు బంధువా? మరి ఎందుకా ఫొటో?
 
ఇదేంటని గట్టిగా అడిగితే కేసులు పెడతారన్న భయంతో మీరు ప్రశ్నించరు. కానీ మీకు ఓటు హక్కు ఉందన్న విషయం మర్చిపోవద్దు. మీ తాత, ముత్తాతలు వారసత్వంగా ఇచ్చిన ఆస్తులపై ఈ రంగుల పిచ్చోడి ఫొటో ఏంటయ్యా. ఇతడ్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే... చివరికి మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు. 
 
ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం టీడీపీ హయాంలో 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం. ఏముంది... అక్కడ కూడా ఈ పిచ్చోడి ఫొటో వేస్తారు. మరుగుదొడ్డి బయట వేస్తే ఫర్వాలేదు... లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు కానీ ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు" అని చంద్రబాబు పేర్కొన్నారు.