ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (08:40 IST)

చంద్రబాబు ఆదేశాన్ని తు.చ తప్పకుండా పాటిస్తా.. ఆ విషయంలో జోక్యం చేసుకోను : కేశినేని నాని

kesineni nani
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాన్ని తు.చ తప్పకుండా పాటిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టంచేశారు. అలాగే, ఈ నెల 7వ తేదీన తిరువూరులో నిర్వహించ తలపెట్టిన బహిరంగ ఏర్పాట్లలో ఏమాత్రం జోక్యం చేసుకోనని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 
 
"అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు వచ్చి తనను కలిశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభ నిర్వహణకు వేరే వారిని ఇన్‌చార్జిగా నియమించినందున ఆ విషయంలోనన్ను కలుగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్టు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు. అధినేత ఆజ్ఞలు తు.చ తప్పకుండా శిరసావహిస్తానని నేను వారికి హామీ ఇచ్చా" అని కేశినేని నాని పేర్కొన్నారు. 
 
అంతా బాగున్నట్టుగానే కనిపిస్తాది.. కానీ చిత్తుగా ఓడిస్తారు.. జగన్‌కు కేసీఆర్ హెచ్చరిక
 
మనకు అంతా బాగున్నట్టుగానే కనిపిస్తుందని, కానీ ఎన్నికల క్షేత్రానికి వెళ్లిన తర్వాత చిత్తుగా ఓడిస్తారని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు. 
 
తన ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడటంతో తుంటె ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‍ నంది నగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ తీరిగ్గా 20 రోజుల తర్వాత గురువారం కలుసుకుని పరామర్శించారు. ఈ భేటీ ఇటు పరామర్శ.. అటు రాజకీయ కోణంలో జరిగింది. 
 
తనతో వచ్చిన వారితో పాటు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను కూడా బయటకు పంపి కేసీఆర్, జగన్‌లు మాత్రమే ఓ గంట పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. చుట్టుముడుతున్న సమస్యల నుంచి బయటపడి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడంపై కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్ ఓటమిని ఊహించలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాగా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదని, ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పినట్టు సమాచారం. 
 
"అంతా బాగుందనుకున్నాం. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక 40 రోజుల్లో పూర్తిగా మార్పు కనిపించింది. ఇది ఊహించని పరిణామం" అని పేర్కొన్నట్టు వినికిడి. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు తమ వ్యతిరేకతను ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు బయటపెట్టరు.. జాగ్రత్త" అని జగన్‌ను కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం.