చంద్రబాబు క్షేమం కోరుతూ రిషికేశ్‌లో కేశినేని నాని యజ్ఞం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేశినేని నానికి విభేదాలున్నాయంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. అయితే, చంద్రబాబుపై తనకెంత అభిమానం ఉందో కేశినేని నాని ఓ యజ్ఞంతో నిరూపించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కేశినేని నాని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్ వెళ్లి పవిత్ర గంగా నదీ తీరంలో యాగం జరిపించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను కేశినేని నాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటూ హృదయపూర్వకంగా ప్రార్థించానని కేశినేని నాని వెల్లడించారు. ఈ యాగంలో కేశినేని నాని కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టు.. బోరున విలపించిన నన్నపనేని రాజకుమారి
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి తీవ్ర భావోద్వేగానికిలోనై, మీడియా ముందే బోరున విలపించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్న అక్కసుతోనే వైసీపీ సర్కారు చంద్రబాబుపై తప్పుడు కేసులు మోపిందని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
'ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అలాంటప్పుడు ఆ చాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి కదా. కానీ మీరేం చేస్తున్నారు... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. యువగళం బ్రహ్మాండంగా జరుగుతుండడంతో, చంద్రబాబుపై ఇంత తొందరపడి చర్య తీసుకున్నారు. ఇలాంటి చర్యలతో యువగళం పాదయాత్రను ఆపేయగలమనుకుంటున్నారా? యువగళం మళ్లీ ప్రారంభమవుతుంది, చంద్రబాబు పర్యటనలు మళ్లీ జరుగుతాయి' అంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు అర్థాంగి భువనేశ్వరి గురించి చెబుతూ నన్నపనేని రాజకుమారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఇవాళ భువనేశ్వరిని చూస్తే చాలా బాధ అనిపించిందని తెలిపారు. ఆమె ధైర్యంగా ఉండాలని చెబుతున్నామని అన్నారు. కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మళ్లీ నవ్వుతూ అందరి మధ్యకు వస్తారని భావిస్తున్నామని చెబుతూ భోరున విలపించారు. మాట్లాడడం ఆపేసి వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.