శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (11:12 IST)

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్

jagan poornahuti
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో శ్రీలక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. 
 
వారికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పండితులతో కలసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మైసూరు దత్తపీఠాధిపతి, అవధూత గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
బుధవారం ఉదయం 9.20 గంటలకు యాగశాలలో విశేష పూజలు ముగిశాయి. అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రుత్విక్కులు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులను ముఖ్యమంత్రి సత్కరించారు.
 
ఈ కార్యక్రమం అనంతరం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయ అభివృద్ధికి సంబంధించి రూ.180 కోట్లను వెచ్చించే మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు యజ్ఞం నిర్వహించారు. ఐదు రోజుల ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయినట్టు మంత్రి కొట్టు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.