గురువారం, 3 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 మే 2023 (12:29 IST)

అవినాశ్ రెడ్డి అరెస్టు అయితే... తెరపైకి వైఎస్.అభిషేక్ రెడ్డి

ysabhishekreddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆయనకు ప్రత్యామ్నాయంగా వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో నేతను ఎంపిక చేశారు. ఆయన పేరు వైఎస్.అభిషేక్ రెడ్డి. వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు. ప్రస్తుతాని పులివెందులలోని రెండు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ఒకవేళ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టు అయితే, పులివెందుల నియోజకవర్గం బాధ్యతలను పూర్తిగా అభిషేక్ రెడ్డికి అప్పగించాలన్న నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారు. అందుకే ఆయన్ను హుటాహుటిన తెరపైకి తెచ్చి, రెండు మండలాలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
 
మొన్నటివరకు ఆయన మరో చిన్నాన్న, కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ నియోజకవర్గ వ్యవహారాలు చూసేవారు. వివేకా హత్య కేసులో ఆయన ఆరెస్టు తర్వాత అవినాశ్ రెడ్డికి అప్పగించారు. ఈయన్ను కూడా ఈ కేసులో సీబీఐ ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డికి తొలుత రెండు మండలాలు అప్పగించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 
 
ప్రకాశ్ రెడ్డి కుమారుడు వైఎస్ మదన్ మోహన్ రెడ్డి కొడుకీయన. ప్రస్తుతం విశాఖలో ఉంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. ఈయన భార్య కూడా డాక్టరే. అభిషేక్ రెడ్డికి ప్రస్తుతం నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలు కట్టబెట్టారు. అవినాశ్ రెడ్డి అరెస్టయితే అప్పుడు మొత్తం నియోజకవర్గం ఈయనకే అప్పజెబుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 
 
వాస్తవానికి భాస్కర్ రెడ్డి మరో సోదరుడైన వైఎస్ మనోహర్ రెడ్డికి ఈ బాధ్యత అప్పగించాలని తొలుత భావించినా.. నియోజకవర్గంలో ఆయనకు అంత పట్టులేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రకాశ్ రెడ్డికి మంచి పట్టుందని.. దీంతో జగన్ ఇటీవల ఆయన్ను పిలిపించుకుని మాట్లాడారని అంటున్నారు. రాజకీయంగా పట్టు సాధించేవరకు మొదట ఆ రెండు మండలాలూ చూడాలని.. అవినాశ్ ఆరెస్టయితే మొత్తం నియోజకవర్గం చూసుకోవలసి ఉంటుందని చెప్పి పంపారని సమాచారం.