ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (10:59 IST)

ఆధునిక ఆంధ్రా రూపశిల్పి చంద్రబాబు... బూటకపు ఆరోపణలతో అరెస్టు దురదృష్టకరం...

Sukhbir Singh Badal
ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి చంద్రబాబు అని ఆయన్ను బూటకపు ఆరోపణలతో అరెస్టు చేయడం తప్పు, దురదృష్టకరమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఆయన క్రూరమైన ప్రతీకార చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. 'ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పిగా పేరుపొందిన చంద్రబాబును బూటకపు ఆరోపణలతో అరెస్ట్ చేయడం దురదృష్టకరం. ఇలాంటి క్రూరమైన ప్రతీకార చర్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి' అని ఆయన పిలుపునిచ్చారు.
 
చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదు : బండి సంజయ్  
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంపై తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే సీఎంగా పని చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత ఏపీ ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరిగిందన్నారు. 
 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వైదొలగిన తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్.. చంద్రబాబు అరెస్టుపై ఒక సుధీర్ఘ ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ఆయనను అరె్టు చేసిన విధానం సరికాదన్నారు. సుధీర్ఘకాలంగా సీఎంగా పని చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టానిక అందరూ సమానమని కానీ, అరెస్టు తీరు మాత్రం ఏమాత్రం సరికాదన్నారు. 
 
కాగా, కేంద్రంలోని ఆ ఇద్దరు బీజేపీ నేతలకు తెలిసే చంద్రబాబు నాయుడిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్మోన్ రెడ్డి అధికార పోలీస్ బలంతో అరెస్టు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు చంద్రబాబు అరెస్టుపై ఒక్కరంటే ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక ఊపు తెచ్చిన మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్ ఈ అరెస్టుపై స్పందించడం గమనార్హం.