మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?
ఈ రాశవారికి గృహాల సంచారం కొంతమేరకు అనుకూలంగానే ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. ధైర్యంగా ముందుకు పోగలరు. కష్టానికి తగిన ఫలితాలున్నాయి. వాక్పటిమతో రాణిస్తారు. కీలక వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చుల విషయంలో మితంగా వ్యయం చేయాలి. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి.
దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. వేడుకలు, శుభకార్యాలకు హాజరవుతారు. పరిచయాలు ఉన్నతికి సహకరిస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం జాగ్రత్త. జీర్ణకోశ సంబంధిత చికాకులు ఎదురయ్యే సూచనలున్నాయి.
ఆహార నియమాలను కచ్చితంగా పాటించండి. అక్టోబర్ మాసం నుంచి మరింత సత్ఫలితాలుంటాయి. ఆర్థికంగా పురోగమిస్తారు. స్థిరాస్తి, వాహనం కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మీ జీవితభాగస్వామి సహాయ సహకరాలు అందిస్తారు. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి.
ఉపాధ్యాయులకు స్థానచలనం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పాస్‌పోర్టు వీసాల విషయంలో కొంత కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర సంతృప్తినీయజాలదు. ఆధ్యాత్మిక, యోగాలపై ఆసక్తి కనబరుస్తారు. తరచు దైవకార్యాల్లో పాల్గొంటారు. మూడు నెలలకొకసారి శనికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన ఈ రాశివారికి శుభఫలితాలిస్తాయి.