శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (18:13 IST)

26/11 ముంబయి దాడులు: ‘ఆ రోజు ఓ సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించింది’

వాళ్ల దగ్గరున్న బ్యాగుల్లో 10 ఏకే-47, 10 పిస్తోళ్లు, 80 గ్రెనేడ్లు, 2000 తూటాలు, 24 మ్యాగజైన్లు, 10 మొబైల్ ఫోన్లు, ఇతర పేలుడు పదార్థాలు, టైమర్లు, తినడం కోసం బాదం పలుకులు, కిస్మిస్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలో నాలుగో పెద్ద నగరాన్ని దెబ్బతీయడానికి ఇవి సరిపోతాయని ఏ మాత్రం అనిపించలేదు. వారికి తమ బాస్ పదే పదే చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. "వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తడమే మీ అతి పెద్ద ఆయుధం". రాత్రి పూట బోటును తీరానికి చేర్చడం కోసం వారు చాలా రోజులు ప్రాక్టీస్ చేశారు.

 
ట్యాక్సీల్లో టైంబాంబు ఎలా పెట్టాలో కూడా వారికి ముందే నేర్పించారు. అలా అవి వేర్వేరు సమయాల్లో పేలిపోయి, తద్వారా ముంబయిపై ఏదో పెద్ద సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించేలా చేయడం కోసం వారు ముందే సిద్ధమై వచ్చారు. రాత్రి సరిగ్గా 8 గంటల 20 నిమిషాలకు వారికి తీరం కనిపించింది. ఆయుధాలున్న రక్‌సాక్‌ (వీపుపై వేసుకునే బ్యాగ్)ను భుజంపై వేసుకునేటప్పుడు అజ్మల్ కసబ్‌కు తన బాస్ మాటలు మళ్లీ గుర్తొచ్చాయి - 'నీ ముఖంపై చంద్రుడిని పోలిన వెలుగు విరజిమ్ముతుంది. నీ శరీరం నుంచి గులాబీ పరిమళాలు వెలువడుతాయి. నీవు నేరుగా స్వర్గానికి చేరుకుంటావు.' అని.

 
26 నవంబర్, రాత్రి 9 గంటల 43 నిమిషాలు, లియోపాల్డ్ కెఫే
ముంబయిలోని కోలాబా కాజ్‌వే చాలా వరకు లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌ను పోలి ఉంటుంది. సన్నగా ఉండే రోడ్డుకు ఇరు పక్కలా వరుసగా దుకాణాలూ, రెస్టారెంట్లుంటాయి. రాత్రి 9 గంటల సమయంలో నలుగురు తీవ్రవాదులు మచ్ఛీమార్ నగర్, బుధ్‌వార్ పార్కు నుంచి ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నారు. తాజ్ హోటల్‌కు వెళ్లాలని డ్రైవరుకు చెప్పారు. వారిలో ఒక వ్యక్తి నెమ్మదిగా ట్యాక్సీ వెనుక సీటుపై టైంబాంబును అమర్చాడు.

 
రీగల్ సినిమా సమీపంలో ట్యాక్సీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. అయితే ఎలాగోలా డ్రైవర్ వారిని లియోపాల్డ్ కెఫే దగ్గరకు చేర్చాడు. అక్కడ ఇద్దరు తీవ్రవాదులు షుయెబ్, నజీర్‌లు తమ బ్యాగులు, ఆయుధాలతో దిగిపోయారు. మిగిలిన ఇద్దరు తాజ్ వైపు ముందుకు సాగారు. డ్రైవర్ కిశోర్‌బంద్ ఫూల్‌చంద్ వారిని తాజ్ సమీపంలో దించేసి మరోవైపు వెళ్లిపోయాడు. మజ్‌గాంకు చేరుకున్న తర్వాత కారులో పేలుడు జరగగా ఆయనా, ఆయనతో పాటు జరీనా షేఖ్, రీమా షేఖ్ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు.

 
షుయెబ్, నజీర్‌లిద్దరూ కొద్దినిమిషాల పాటు లియోపాల్డ్ ఎదుట నిలబడ్డారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి మరొకతనితో 'ఓ భాయ్, బిస్మిల్లా చేద్దాం' అని అన్నాడు. అతడు లియోపాల్డ్ లోపలికి వెళ్లనే లేదు. వారిద్దరూ రోడ్డు మీది నుంచే ఏకే-47 రైఫిల్‌లతో కాల్పులు ప్రారంభించారు. అక్కడున్న వాళ్లంతా భయంతో వెనుక భాగంలో ఉన్న గేటు వైపు పరిగెత్తారు. షుయెబ్, నజీర్‌లు ఫైరింగ్ చేస్తూనే ఒక ద్వారం నుంచి జొరబడి మరో ద్వారం నుంచి బైటికి వచ్చారు.

 
మొత్తం ఆపరేషన్‌కు ఒక్క నిమిషంకన్నా ఎక్కువ సమయం పట్టలేదు. అక్కడ మొత్తం 9 మంది మరణించారు. వాళ్లు రెస్టారెంట్ నుంచి మళ్లీ రోడ్డు మీదకు వచ్చిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. అక్కడికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న కోలాబా పోలీస్ స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌కు ఏకే-47 తుపాకీ మోతలు వినిపించాయి. వెంటనే ఆయన లియోపాల్డ్ వైపు పరుగెత్తారు. ఆయనకు మొదట అక్కడ బాంబు పేలినట్టు అనిపించింది. అక్కడ శవాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వెంటనే ఆయన తన సహచరుడి దగ్గరున్న వాకీటాకీ తీసుకొని సౌత్ కంట్రోల్‌కు మొదటి సందేశం ఫ్లాష్ చేశారు - "21.48, కొలాబా 1ని లియోపాల్డ్ హోటల్‌కు పంపించండి." అని.

 
26 నవంబర్, రాత్రి 9 గంటల 45 నిమిషాలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్
బోటుపై కూర్చోవడానికి ముందు కుబేర్ నావలో ఉన్నప్పుడే ఇస్మాయిల్ ఖాన్ వారందరికీ పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న 10 ఇమామీ జామిన్‌లు (చేతికి కట్టుకునే వస్త్రాలు) ఇచ్చాడు. వీటిని కుడి చేతికి కట్టుకోవాలని వారికి సూచించాడు. ఇస్మాయిల్ ఖాన్, కసబ్‌లిద్దరూ బుధ్‌వార్ పార్క్ వద్ద పడవ దిగిన తర్వాత కొద్దిసేపు అక్కడే ఆగారు. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చని వారు సందేహించారు. ఆ తర్వాత వారొక క్యాబ్‌ను ఆపారు. దాని నెంబర్ ఎంహెచ్-01-జీ779.

 
ఇస్మాయిల్ ఖాన్ ముందువైపు డోర్ తెరిచి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారును వీటీ స్టేషన్ పోనివ్వమని అతడు డ్రైవర్‌ను ఆదేశించాడు. ఆ తర్వాత డ్రైవర్‌తో మాటలు కలిపాడు. డ్రైవర్‌ను మాటల్లో పెట్టడం అతని పని. తద్వారా వెనుక సీటులో కూర్చున్న కసబ్‌కు డ్రైవర్ సీటు కింద టైంబాంబు అమర్చేందుకు వీలు కలిగించాలి.

 
సీఎస్‌టీ దగ్గర దిగిన తర్వాత కసబ్ తన ఆయుధాల్ని బైటికి తీయడం కోసం పక్కనే ఉన్న ఓ టాయిలెట్‌ లోపలికి వెళ్లాడు. వీరిద్దరూ రెండో తరగతి ప్రయాణికులు ఉండే విశాలమైన వెయిటింగ్ రూంకు వెళ్లారు. అక్కడే టికెట్ కొనుక్కోవడానికి ప్రయాణికులు పొడవాటి క్యూలో నిల్చుని ఉన్నారు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.

 
కసబ్ ఫైరింగ్ చేస్తుంటే ఇస్మాయిల్ మాత్రం తనను ఎవరూ చూడకుండా ఉండే ఒక ప్రాంతంలో దాక్కున్నాడు. నిరాయుధ ప్రజలపై గ్రెనేడ్లు విసిరి వీలైనంత ఎక్కువ ప్రాణనష్టం జరిగేలా చూడడం అతడి పని. తుపాకీ తుటాలు తగిలి జనాలు పిట్టలా రాలిపోయారు. కాల్పుల శబ్దం వినగానే రైల్వే అనౌన్సర్ విష్ణు జేండే ప్రయాణికులు వీలైనంత త్వరగా స్టేషన్ నుంచి బైటికి వెళ్లిపోవాలని లౌడ్ స్పీకర్‌లో ప్రకటించసాగాడు. ఈ హెచ్చరిక ఫలితంగా చాలా మంది ప్రాణాలు దక్కాయి. అయినప్పటికీ ఈ ఫైరింగ్‌లో మొత్తం 58 మంది చనిపోయారు.

 
26 నవంబరు, రాత్రి 9గంటల 48నిముషాలు, తాజ్ ప్యాలస్ హోటల్
షోయబ్, నజీర్‌ని లియోపాల్డ్ కేఫ్ దగ్గర ఉంచి, అబ్దుల్ రెహమాన్ బడా, అబూ అలీ ఇద్దరూ కలిసి తాజ్ ప్యాలస్ హోటల్ ఎదురుగా తమ ట్యాక్సీని ఆపారు. అక్కడ దిగి వారు హోటల్ వెనుక భాగంలో ఉన్న గోకుల్ రెస్టారెంట్ ప్రాంగణంలో ఓ టైం బాంబు సెట్ చేశారు. టైల్స్ పడేసి ఉన్న చోట పోలీస్ అవుట్‌పోస్టు ఉంది. అక్కడ కూడా వారు మరో బాంబు పెట్టారు. హోటల్ లోపలికి వెళ్లేముందు అక్కడున్న డిటెక్టివ్ డాగ్‌ను కూడా వారు కాల్చి చంపేశారు.

 
మెయిన్ డోర్ నుంచి వారు హోటల్ లోపలికి వచ్చారు. తాజ్ ప్యాలస్ విశిష్టతను చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. కొన్ని సెకండ్లపాటు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఎర్రటి టీ షర్టులో ఒకతను కుడివైపున్న 'హార్బర్ బార్' వైపు వెళ్ళాడు. పసుపు రంగు టీ షర్టులో ఉన్నతను 'షామియానా' వైపు వెళ్ళాడు. ఎక్కడికెళ్లాలో వారికి ముందే తెలుసు. వారు ఒకే సమయంలో తమ తమ బ్యాగులను కింద పెట్టి అందులో నుంచి ఏకే 47 గన్స్ తీశారు.

 
26 నవంబరు, రాత్రి 11గంటల 50నిముషాలు, రంగ్ భవన్ లైన్
ఇంతలో ముంబాయి జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కరే, అదనపు కమిషనర్ (ఈస్ట్) అశోక్ కామ్టే రంగంలోకి దిగారు. ఇన్స్‌పెక్టర్ సలాస్కర్‌తో కలిసి ఓ జీపులో కూర్చొని రంగ్ భవన్ లైన్ వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే కసబ్, ఇస్మాయిల్ కామా ఆసుపత్రి నుంచి పరారయ్యారు. ఇన్స్‌పెక్టర్ సలాస్కర్ అప్పుడు కాల్పులు జరుపుతున్నారు. అశోక్ కామ్టే ఆయన పక్కన ఉన్నారు. హేమంత్ కర్కరే సీటు మధ్యలో కూర్చున్నారు. వెనుక సీట్లో డ్రైవర్, క్రైం బ్రాంచ్ అధికారి అరుణ్ జాదవ్, ఇంకా ముగ్గురు పోలీసు అధికారులు కూర్చొని ఉన్నారు.

 
అకస్మాత్తుగా ఒక పొడవైన వ్యక్తి, ఓ తక్కువ ఎత్తున్న వ్యక్తి ముందు నుంచి వచ్చి హేమంత్ కర్కరే బండిపై కాల్పులు జరిపారు. కాల్పులను చూస్తే వారు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు కనిపించింది. ఒక్క బులెట్ కూడా వారు వృధా చేయలేదు. వారు అక్కడకొచ్చి ఆ బండి డోర్ తెరిచి ముందు సీట్లో ఉన్న వారిని కిందకు తోసేశారు. ఇస్మాయిల్ స్టీరింగ్ పట్టుకుంటే కసబ్ అతని పక్కనే కూర్చున్నాడు. కాస్త దూరం వెళ్లిన తర్వాత టైరు పంక్చర్ అయ్యింది. ఇస్మాయిల్, కసబ్ వెనువెంటనే ఏమీ ఆలోచించకుండా కిందకు దిగి అక్కడి నుంచి వెళుతున్న ఓ స్కోడా కారును ఆపారు. డ్రైవర్‌ని బలవంతంగా కిందకు దించి బండి నడుపుకుంటూ వెళ్లిపోయారు.

 
27 నవంబరు, అర్థరాత్రి 12గంటల 40నిముషాలు, మెరీన్ డ్రైవ్
పోలీస్ వైర్‌లెస్ ఫోనుకు ఓ సందేశం వచ్చింది. 'స్కొడా కార్ 02 JP 1276, సిల్వర్ కలర్, హైజాక్డ్ బై టెర్రరిస్ట్.' దాని సారాంశం. ఐడియల్ కేఫ్ ముందు సిల్వర్ కలర్‌లో ఉన్న ఓ స్కోడా కారు పోలీసులకు కనిపించింది. వారు కారును ఆపాలని సైగ చేశారు. బేరియర్‌కి కాస్త ముందు కారు ఆగింది. కానీ బయటి నుంచి చూసేవారికి తామెవరో గుర్తుపట్టకుండా ఉండడానికి డ్రైవర్ వైండ్ స్క్రీన్‌పై నీళ్లు పోసి వైపర్ ఆన్ చేశాడు.

 
ఇద్దరు పోలీసులు కారుకు ఎడమవైపు వెళ్లారు. అప్పుడే ఎవరో కారు వెనుక సీటు వైపున్న కిటికీపై కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ చేతులు పైకెత్తాలని కసబ్‌కు చెప్పాడు. అప్పుడే ఇస్మాయిల్ తన వైపు వస్తున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.
ఇస్మాయిల్ సీట్ నుంచి కింద పొడిపోవడం కసబ్ చూశాడు. అతని మెడలో బులెట్ తగిలింది. అప్పుడే కసబ్ రెండు డోర్లను తెరిచి తన ఏకే 47 తీసుకునే ప్రయత్నం చేశాడు. తన వేలును ట్రిగ్గర్‌పై పెట్టి పోలీస్ ఇన్స్‌పెక్టర్ తుకారాం ఓంబాలే కడుపులో బుల్లెట్లు దింపేశాడు.

 
కానీ తుకారాం ఓంబాలే ఏకే 47 గన్ ముందు భాగాన్ని పట్టుకొని చివరిదాకా వదల్లేదు. అప్పుడే చాలామంది పోలీసులు అక్కడకు వచ్చి కసబ్ చుట్టూ చేరి అతన్ని కొట్టడం మొదలు పెట్టారు. అప్పుడే ఎవరో అరుస్తూ అన్నారు. ''ఆగండి, ఆగండి, అతను మాకు ప్రాణాలతో కావాలి'' అని. కసబ్‌ కాళ్ళు, చేతులు కట్టేసి ఓ అంబులెన్స్‌లో అతన్ని తరలించారు. అతను వేసుకున్న కొత్త టెన్నిస్ బూట్లు అక్కడే వదిలేసి ఉన్నాయి.

 
28 నవంబరు, తెల్లవారుజాము 2గంటలు, తాజ్ ప్యాలెస్ హోటల్
మానేసర్ నుంచి మూడు విమానాల్లో బ్లాక్‌క్యాట్ కమెండోలు ముంబయి చేరుకున్నారు. అందులో నుంచి 100పైగా కమెండోలను తాజ్ ఆపరేషన్‌లో మోహరించారు. ఆ హోటల్‌లో దాదాపు 600 గదులు ఉన్నాయి. సీసీటీవీ కవరేజ్ దాదాపు డిస్కనెక్ట్ అయ్యింది. అంతకన్నా ఆందోళనకర విషయమేమిటంటే తాజ్ ప్యాలస్ సిబ్బంది మొత్తం హోటల్ నుంచి బయటికొచ్చేశారు. దీంతో కమెండోల వద్ద అతిథుల జాబితా కూడా లేకపోవడంతో ఎవరు ఏ గదిలో ఉన్నారో వారికి అర్థం కాలేదు.

 
ప్రతి గదికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. కానీ తీవ్రవాదులు ఫోన్ చేస్తున్నారేమోనని భయపడి ఎవరూ కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఓ డాటా ఎంట్రీ మహిళా ఉద్యోగి ఫ్లోరిస్ మార్టిస్ ఒక గదిలో చిక్కుకొని ఉన్నారని తెలిసింది. దీంతో ఎలాగైనా తాను ఆమెను సురక్షితంగా బయటికి తీసుకొస్తానని మేజర్ ఉన్నికృష్ణన్ చెప్పారు. ఆయన తనతోపాటు ఆరుగురు సభ్యులను లోపలి తీసుకెళ్లారు. ఆయన మెట్లెక్కుతూ పైకి వెళ్లారు.

 
ఆయనతోపాటు వెళుతున్న సునీల్ యాదవ్‌పై కాల్పులు జరిగాయి. ఉన్నికృష్ణన్ ఎడమవైపు కూడా ఎవరో కాల్పులు జరిపారు. ఆయన కుడివైపు నుంచి ముందుకు వెళ్లి కాల్పులు జరిపే వారిని వెనుక నుంచి పట్టుకుందామని అనుకున్నారు. కానీ కాల్పులు జరిపేవారు అక్కడ కూడా ఉన్నారు. 
అప్పుడే ఓ బుల్లెట్ ఉన్నికృష్ణన్‌ శరీరంలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయన రేడియో ద్వారా 'ముందుకు రావద్దు' అని హెచ్చరించారు.

 
అప్పుడు ఆయన వేగంగా శ్వాస తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన వాకీటాకీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేజర్ ఉన్నికృష్ణన్ 'మిస్సింగ్' అని చెప్పారు. కానీ ఆయనతో అక్కడకు వెళ్లిన సహచరులు కాల్పులు జరిపే వారిని 'వాసాబి రెస్టారెంట్' దగ్గరే ఉండిపోయేలా చేశారు. "పైకి వెళ్లడానికి రెండు నిమిషాల ముందే నేను మేజర్ ఉన్నికృష్ణన్‌తో మాట్లాడాను. నేను అతనితో 'టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్' అని కూడా అన్నాను. దీనిపై ఆయన 'ఎవ్రీ థింగ్ విల్ బి ఆల్‌ రైట్ ' అని కూడా సమాధానమిచ్చారు" అని బ్రిగేడియర్ గోవింద్ సింగ్ తెలిపారు. పరిస్థితి అదుపులోకి వస్తుందని మొదటిసారి బ్లాక్‌క్యాట్ కమెండోలకు అనిపించింది. కానీ దానికి బదులుగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని వారు సమర్పించుకున్నారు.


28 నవంబరు, సాయంత్రం 4గంటలు, వాసాబి రెస్టారెంట్, తాజ్ ప్యాలస్ హోటల్
అప్పటికీ కాల్పుల శబ్ధం వినిపిస్తూనే ఉంది. అందులో ఇద్దరు గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న హార్బర్ బార్ నుంచి కమెండోలపై కాల్పులు జరుపుతుంటే, మరో ఇద్దరు వాసాబి రెస్టారెంట్ నుంచి కాల్పుల మోత మోగిస్తున్నారు. అప్పుడు వాసాబి రెస్టారెంట్ కిటికీలపై ఉన్న టిఫెన్ గ్లాస్‌పై ఇజ్రాయెల్ స్నిపర్ గన్‌తో కాల్పులు జరిపమని బ్రిగేడియర్ సిసోడియా బ్లాక్ క్యాట్ కమెండోలను ఆదేశించారు.

 
వారు అక్కడి నుంచి కదిలిన తర్వాత, వారిపై ట్రైపోడ్‌పై ఉన్న గ్రెనేడ్ లాంచర్ల ద్వారా దాడి చేయమని ఆయన ఆదేశించారు. అక్కడ ఉన్న పొగ కనుమరుగైన తర్వాత వాసాబి హోటల్‌లో ఉన్న దృశ్యం బ్రిగేడియర్ సిసోడియాకు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అక్కడ చూస్తే కాల్పులు జరుపుతున్నవారు బతికే ఉన్నారు. వారిలో ముగ్గురు బ్లాక్‌క్యాట్ కమెండోలపై కాల్పులు జరుపుతున్నారు. ఇంకా ఒకరు తెల్లటి రంగులో ఉన్న రుమాలును అటుఇటు ఊపుతున్నాడు.

 
వారు మమ్మల్ని ఊరిస్తూ లోపలి పిలిచే పన్నాగమేమోనని బ్రిగేడియర్లు అనుమానం వ్యక్తం చేశారు. బయట ఎన్‌ఎస్‌జీ ప్రముఖులు జ్యోతిదత్త శనివారం ఉదయానికల్లా తాజ్ ప్యాలెస్ హోటల్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి చేస్తామని తెలిపారు. ఇంత తీవ్ర ఒత్తిడిలో కూడా బ్రిగేడియర్ సిసోడియా మాత్రం తన సహచరులతో జోకులేస్తూ ' వైమానిక దళాన్ని పిలిచి ఈ మొత్తం భవనాన్ని నేలమట్టం చేసేద్దామా ? అని అడిగారు.

 
28 నవంబరు, రాత్రి 7 గంటలు, హార్బర్ బార్, తాజ్ ప్యాలస్ హోటల్
బ్లాక్ క్యాట్స్‌కు చెందిన రెండు బృందాలు హార్బర్ బార్, వాసాబి రెస్టారెంట్‌లో రెండు ఐఈడి డివైస్ (పేలుడు పదార్థాలు)లను విసిరారు. అప్పుడే రెండు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఆ భవనం నుంచి నల్లటి పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. నల్లటి రంగులో ఓ మానవ ఆకృతి హోటల్ బయట వచ్చిపడింది.

 
అతని కాళ్లలో మంటలు ఎక్కువగా ఉన్నాయి. అతని పరిస్థితి గాలిలో సైకిల్ నడుపుతున్నట్లు కనిపించింది. అతడు కింద పడిన తర్వాత చనిపోయిన ఓ పావురం కూడా అక్కడ వచ్చి పడింది. అక్కడే అతని కోసం వేచి చూస్తున్న షూటర్లు అతని తలలో మరో బుల్లెట్ దించారు. అతని ముఖం మందుగుండుతో మాసిపోయి ఉంది. అతని శరీరం మొత్తం బొగ్గు తారు పూసినట్లు కనిపించింది.

 
అతని పిడికిళ్లు బిగిసి ఉన్నాయి. ఏదో నొప్పితో ఉన్నట్లు కనిపించింది. ఇతనే అబూ షోయబ్. లియోపాల్డ్ రెస్టారెంట్‌లో దాడి చేసింది ఇతనే. అబూ షోయబ్ అక్కడ దాడి చేసే తాజ్ ప్యాలస్ హోటల్‌కు వచ్చాడు.

 
కొన్ని రోజుల తర్వాత, ఉదయం 10 గంటలకు, జేజే ఆసుపత్రి బైకులాలో
అజ్మల్ కసబ్ భారత నిఘా సంస్థ విచారణలో వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆగలేదు. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబితే అరెస్టు చేసిన అతని సహచరులతో కలిసే అవకాశం కల్పిస్తామని కసబ్‌కు చెప్పడమే దానికి కారణం. చివరికి ఆ రోజు కూడా రానే వచ్చింది. ఆ రోజు అజ్మల్ కసబ్‌ను పోలీసుల బృందం గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ ప్యాలస్ హోటల్ వైపు నుంచి తీసుకువెళుతూ చివరికి అతన్ని బైకులాలో ఉన్న జేజే ఆసుపత్రికి తరలించారు.

 
తనతో పాటు ఉన్న పోలీసులతో మాట్లాడుతూ 'నాతోటి మిత్రులు తీవ్రంగా గాయపడ్డారా?' అని అజ్మల్ కసబ్ అడిగితే, నీ కళ్ళతో నువ్వే చూసుకో అని ఓ పొలీసు అధికారి సమాధానమిచ్చారు. ఆ తర్వాత కసబ్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ స్టెయిన్‌లెస్ స్టీలుతో చేసిన 9 ట్రేలు ఉన్నాయి. అందులో దాడికి పాల్పడిన వారి శవాలు ఉన్నాయి. తాజ్ ప్యాలెస్‌లో చనిపోయిన ఈ శవాలు గుర్తుపట్టే స్థితిలో కూడా లేవు.

 
అజ్మల్ కసబ్ ఆ శవాలను చూసిన వెంటనే గట్టిగా అరుస్తూ 'నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి' అని అన్నాడు. ఆ తర్వాత అతన్ని జైలుకు తీసుకొచ్చారు. అక్కడ ఓ పోలీసు అధికారి అజ్మల్ కసబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అజ్మల్ కసబ్‌ను చూసి ఆ పొలీసు అధికారి 'అజ్మల్ గారు, వారి ముఖాలపై ఉన్న కాంతిని మీరు చూశారా? వారి శరీరం నుంచి గుబాళిస్తున్న గులాబీ సువాసన చూశారా ? అని ప్రశ్నించారు. ఇది విన్న తర్వాత అజ్మల్ కసబ్ వెక్కి వెక్కి ఏడ్చాడు.

 
(అజ్మల్ కసబ్ ఛార్జ్‌షీట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మాజీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బ్రిగేడియర్ గోవింద్ సింగ్ సిసోడియా, అనేకమంది ప్రత్యక్ష సాక్షుల వాదనల ఆధారంగా)