బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2024 (14:31 IST)

అమెరికా: ట్రంప్ గెలవగానే, అబార్షన్ పిల్స్ కొనుగోళ్లు ఎందుకు పెరిగాయి?

Abortion
అమెరికా అధ్యక్షునిగా డోనల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత, అక్కడ గర్భవిచ్ఛిత్తి ఔషధాల (అబార్షన్ పిల్స్‌‌) కొనుగోళ్లు పెరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘గర్భ నిరోధక, గర్భస్రావ మాత్రల కోసం ఇంటర్నెట్‌‌లో సెర్చ్ 254 శాతం పెరిగింది’’ అని అమెరికాలోని ప్లాన్-సి అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అబార్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. ట్రంప్ వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అబార్షన్ హక్కులను జాతీయ స్థాయిలో రద్దు చేసే ప్రమాదం ఉందన్న భయాందోళనలతో మహిళలు గర్భ నిరోధక, గర్భస్రావ మాత్రలను ముందే కొని దాచిపెట్టుకుంటున్నారని, ఐయూడీ (కాపర్ టీ) ని అమర్చుకునేందుకు అపాయింట్‌మెంట్‌లు తీసుకుంటున్నారని అమెరికా పత్రికలు రాస్తున్నాయి.
 
‘ఎయిడ్ యాక్సెస్’ అనే సంస్థ ఆన్‌లైన్‌లో గర్భస్రావ మాత్రలను సరఫరా చేస్తుంది. సాధారణంగా ఈ సంస్థకు రోజుకు 600 ఆర్డర్లు వస్తుంటాయి. కానీ, అమెరికా ఎన్నికలు జరిగిన మర్నాడు 10,000 ఆర్డర్లు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించినట్టు అమెరికా వార్తాపత్రిక ‘ది హిల్’ తెలిపింది. అత్యవసర గర్భనిరోధక మాత్రలు అందించే హెల్త్‌కేర్ కంపెనీ 'కేడెన్స్ ఓటీసీ' కూడా మాత్రల కొనుగోళ్లలో భారీ పెరుగుదల కనిపించినట్టు తెలిపింది. ఒకవారంలో జరిగే కొనుగోళ్ల కన్నా 5 రెట్లు ఎక్కువ కొనుగోళ్లు ఒక్కరోజులోనే జరిగాయని పేర్కొంది. లైంగిక, పునరుత్పాదకత సమస్యలపై ఆన్‌లైన్‌లో వైద్యం అందించే మరొక సంస్థ విస్ప్.. ఇదే రకమైన డిమాండ్ గురించి ప్రస్తావించింది. నవంబర్ 6న, వైద్యం కోసం రెగ్యులర్‌గా తమ వద్దకు వచ్చేవారిలో అత్యవసర గర్భ నిరోధక మాత్రల కొనుగోళ్లను పరిశీలించినప్పడు అమ్మకాలు 1,000 శాతం పెరిగాయని, కొత్త పేషెంట్ల విషయంలో ఆ అమ్మకాలు 1,650 శాతం పెరిగాయని విస్ప్ సంస్థ సీఈఓ మోనికా సెపక్ తెలిపినట్టు ది హిల్ వెల్లడించింది.
 
ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే అబార్షన్ హక్కులను రద్దు చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే, గర్భస్రావ మాత్రలు అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గిపోతాయన్న భయంతోనే మహిళలు ఈ మాత్రలు కొని, నిల్వ చేసుకుంటున్నారని అంటున్నారు. నవంబర్ 6-8 మధ్యలో అబార్షన్ మాత్రల కోసం తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 గర్భిణులు కాని మహిళల నుంచి వచ్చాయని ‘జస్ట్ ది పిల్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జూలీ అమాన్ చెప్పినట్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది.
 
అబార్షన్లపై ట్రంప్ మాటేమిటి?
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో, తాను తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అబార్షన్ హక్కుల నిరోధాన్ని వీటో చేస్తానని ట్రంప్ చెప్పారు. గర్భస్రావంపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాల చేతిలో ఉండాలని అంటూనే, గర్భస్రావం నిషేధంలో అత్యాచారం, తల్లి ఆరోగ్యం మొదలైనవాటికి మినహాయింపులు ఇవ్వాలనీ చెబుతూ వచ్చారు. మరోవైపు, 2022లో రో వర్సెస్ వెడ్ కేసు తీర్పును రద్దు చేయడంలో తాను ప్రధాన పాత్ర పోషించినట్టు పలుమార్లు చెప్పుకున్నారు. అమెరికాలో సుమారు 50 ఏళ్ల క్రితం రో వర్సెస్ వెడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన తీర్పును 2022లో అక్కడి సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు వెల్లడించిన జడ్జిలు ట్రంప్ హయాంలోనే నియమితులయ్యారు.
 
"ట్రంప్ పదవీ కాలంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జిల నియామకం ఎక్కువగా జరిగింది. చట్ట సవరణ ఒక స్థాయి వరకూ క్లియర్ అయ్యింది" అని ది వాషింగ్టన్ పోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఎంబర్ ఫిలిప్స్ గతంలో అన్నారు. 2024 ఎన్నికలకు ముందు అక్టోబర్‌లో ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ "అబార్షన్ నిషేధం అంశం ముగిసినట్టే. రో వర్సెస్ వెడ్ కేసు తీర్పును పునరుద్ధరించాలని అందరూ కోరుకున్నారు. నేనూ అదే చేశాను" అంటూనే "భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం" అని కూడా అన్నారు. ట్రంప్ మాటలు నమ్మొద్దంటూ ఎన్నికల సమయంలో డెమొక్రాట్లు ప్రచారం కూడా చేశారు. రిపబ్లికన్లకు మద్దతు ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం ఉన్న సంగతిని గుర్తుచేశారు.
 
అమెరికాలోని తెలుగువారు ఏమంటున్నారు?
ట్రంప్ మళ్లీ పదవిలోకి రావడం, అబార్షన్ హక్కులపై భయాలు చూస్తుంటే అమెరికా కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయినట్టు అనిపిస్తోందని కొందరు అభిప్రాయపడితే, ఈ భయాలన్నీ ఫార్మా కంపెనీల గిమ్మిక్కులని మరికొందరు అంటున్నారు. అబార్షన్‌పై నిషేధం స్త్రీల హక్కులకు భంగం కలిగిస్తుందని, అది అభివృద్ధి నిరోధకమని వాషింగ్టన్ డీసీలోని జార్జిటౌన్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ లక్ష్మి అన్నారు. "ఇదంతా చూస్తుంటే దేశం కొన్ని దశాబ్దాల వెనక్కి మళ్లినట్టు అనిపిస్తోంది. అమెరికావాసులు మహిళా అధ్యక్షురాలిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని మాత్రం తెలుస్తోంది. మామూలు ప్రజలకు ట్రంప్ ఏమీ చేయలేదు. అయినా మెజారిటీ ట్రంప్ పక్షం వహించింది. ఇక్కడ ఎవాంజిలికల్ ఓటు బ్యాంకు ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. సంప్రదాయ క్రిస్టియన్లు ట్రంప్ వైపే మొగ్గుచూపారు.
 
అమెరికాలో అమెరికన్ల జనాభా తగ్గిపోతోందని, అబార్షన్లను నిషేధించడం ద్వారా వారి సంఖ్యను పెంచవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎక్కువ మందికి ఈ అభిప్రాయమే ఉండి ఉండవచ్చు. వారంతా ట్రంప్‌కి ఓటు వేసి ఉంటారు. మరోవైపు, అబార్షన్ల్‌పై నిషేధం రావొచ్చన్న భయాలూ వినిపిస్తున్నాయి" అని ప్రొఫెసర్ లక్ష్మి అన్నారు. నలభై ఏళ్లు పైబడిన మహిళల కంటే హైస్కూల్, కాలేజీ అమ్మాయిల్లో అబార్షన్ మాత్రల కొనుగోళ్లు పెరిగి ఉండవచ్చని పెన్సిల్వేనియాలోని ఐటీ ఉద్యోగి కల్పన అన్నారు. "నలభై ఏళ్ల వాళ్ల కన్నా హైస్కూల్ అమ్మాయిల్లో అబార్షన్ రేటు అధికంగా ఉన్నట్టు ఒక రిపోర్ట్ తెలిపింది. అబార్షన్‌పై నిషేధం వస్తే చిన్న వయసులోనే తల్లి కావడం అమ్మాయిలకు భారం అవుతుంది. ఆ భయంతోనే వాళ్లు గర్భస్రావ మాత్రలు కొని, నిల్వచేసుకుంటూ ఉండవచ్చు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
 
అయితే, ఎన్నికల తర్వాత గర్భ నిరోధక, గర్భస్రావ మాత్రల కొనుగోళ్లలో పెరుగుదల ఫార్మా కంపెనీలు సృష్టించిన హైప్ కావొచ్చని వర్జీనియా నివాసి, ఒక ఐటీ సంస్థ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. "భయాన్ని సృష్టించడం ద్వారా కొనుగోళ్లు పెంచుకోవడం ఫార్మా కంపెనీలు చేసే గిమ్మిక్కు. అబార్షన్ మాత్రల కొనుగోళ్లు పెరిగాయని హైప్ సృష్షిస్తే జనాల్లో భయం పెరుగుతుంది. వాళ్లు మరింత కంగారుపడి మరికొంచెం కొనుగోళ్లు పెంచుతారు. నిజానికి ఈ ఫార్మా కంపెనీలు చెబుతున్న స్థాయిలో గర్భ నిరోధక, గర్భస్రావ మాత్రల అమ్మకాలు పెరిగి ఉండకపోవచ్చు" అన్నారాయన. గ్రామీణ ప్రాంతాల కన్నా, నగర వాసుల్లో అబార్షన్ హక్కులపై భయాలు ఎక్కువగా ఉండొచ్చని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
 
“అబార్షన్ల విషయంలో సంప్రదాయ అమెరికన్లకు ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చర్చి విశ్వాసకులకు అబార్షన్లపై పూర్తి విముఖత ఉంటుంది. కానీ, పట్టణ ప్రాంతాల్లో స్కూల్, కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు అబార్షన్ హక్కులపై సానుకూలమైన అభిప్రాయాలు ఉంటాయి. అలాగే, కాలేజీల్లో చదువుకుంటున్న వారిలో వేరే దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరంతా వ్యక్తి స్వేచ్ఛ, హక్కుల గురించి మాట్లాడుతుంటారు. వీటన్నిటి ప్రభావం పట్టణ, నగర వాసులపై ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అబార్షన్ మాత్రల కొనుగోళ్లు పెరిగి ఉండవచ్చు.
 
మరోవైపు ట్రంప్, ఇలాన్ మస్క్ మధ్య బాగా సఖ్యత కనిపిస్తోంది. అమెరికాలో అమెరికన్ల సంఖ్య తగ్గిపోతోందని, లేబర్ ఫోర్స్ తగ్గిపోతోందని మస్క్ చెబుతూ వస్తున్నారు. అబార్షన్లు నిషేధిస్తే జనాభా పెరిగి ఈ సమస్య పరిష్కారం కావొచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పదవి చేపట్టగానే అబార్షన్ హక్కుల నిషేధంపై కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే భయం కొందరిలో ఉంది" అని వివరించారు చంద్రశేఖర్.