శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 13 జూన్ 2022 (18:46 IST)

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు: ‘‘పోలీసువైతే యూనిఫాం ఏది? ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు’’

women police
"చెప్పండి... నేను మహిళా పోలీసును మాట్లాడుతున్నా" - రోజూ ఇలా మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 14 వేల మందికి పైగా మహిళా పోలీసుల విధి నిర్వహణ. వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి పంచాయతీ పరిధిలో మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించింది. ప్రస్తుతం వీరినే సచివాలయం మహిళా పోలీసు అని పిలుస్తున్నారు. మహిళా పోలీసు ఆయా పంచాయితీ పరిధిలో ఉన్న ఒక్కొక్క గ్రామంలో దొంగతనాలు, బాల్య వివాహాలు, శాంతి భద్రతలు, భార్యభర్తల గొడవలు, రాజకీయ కలహాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. పాఠశాలలకు, అంగన్వాడీలకు వెళ్లి వంటల నాణ్యత, రుచితో పాటు పిల్లల బాగోగులు పరిశీలించాలి.

 
దిశ యాప్ వాడకం గురించి, సైబర్ నేరాలు, లైంగిక వేధింపుల గురించి మహిళలకు అవగాహన కల్పించాలి. పోలీసుకు స్కూల్స్, అంగన్వాడీలలో పనేంటి? వీరికి ఏ డిపార్ట్ మెంట్ జీతం ఇస్తుంది?- లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఏపీలోని కొందరు మహిళా పోలీసులతో బీబీసీ మాట్లాడింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో సచివాలయం మహిళా పోలీసుగా పని చేస్తున్న సీహెచ్ ఆశాలత బీబీసీతో మాట్లాడారు.

 
గ్రామాల్లో విజిలెన్స్ వర్క్
"మేం హోం డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వస్తాం. పోలీసు శాఖ. అయినప్పటికీ కూడా మేం ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం) పని కూడా చేస్తాం. అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యత, రుచి లాంటివి మేం పరిశీలిస్తాం. పిల్లల పెరుగుదలను కూడా పర్యవేక్షిస్తాం. వారిలో ఏవైనా లోపాలుంటే గుర్తించి ఆయా విభాగాలకు తెలియజేస్తాం. పాఠశాలలకు సంబంధించి విజిలెన్స్ వర్క్ కూడా చేస్తాం. టీచర్స్ బడికి వస్తున్నారా లేదా అనేది తనిఖీ చేస్తూ పై అధికారులకు సమాచారం ఇస్తాం. గ్రామాల్లో ఎవరైనా కొత్త ముఖాలు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఆ సమాచారం మా పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు అందిస్తాం. ఏ ఇంట్లోనైనా కుటుంబ కలహాలు వస్తే వారి వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తాం" అని ఆశాలత చెప్పారు.

 
గుడ్ టచ్, బ్యాడ్ టచ్... ఈవ్ టీజింగ్
"గ్రామాల్లో ఎక్కువగా ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిల్లో డ్రాప్ అవుట్స్ ఉంటారు. వాళ్లు మధ్యలోనే బడి ఎందుకు మానేస్తున్నారనే విషయాన్ని చాలా క్షుణంగా పరిశీలిస్తాం. వాళ్లని తల్లిదండ్రులు పనులకు పంపిస్తున్నారా? బడికి వచ్చేటప్పుడు లేదా బడిలో వాళ్లకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయా అనేది చూస్తాం. ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాం. ఇంట్లో వాళ్లు కానీ, బయటి వ్యక్తులు కానీ వాళ్లని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారా అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాలపై బాలబాలికలు ఇరువురికి కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాం. స్థానిక పాఠశాలలే కాకుండా ఇంటర్, డిగ్రీ కాలేజీలకు వెళ్లి కూడా అక్కడ ఈవ్ టీజీంగ్‌పై ఆరా తీస్తాం. కొందరు చెప్పుకోలేక ఇబ్బంది పడితే వాళ్లతో మాట్లాడి మెల్లగా విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంటాం".

 
పోలీసైతే, యూనిఫాం ఏది?
"ఈ ఉద్యోగంలో చేరి రెండున్నరేళ్లు అయ్యింది. మహిళా పోలీసు అంటూ మేం గ్రామాల్లోకి వెళ్తే మమ్మల్ని మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకునే కారు. పైగా పోలీసువైతే యూనిఫాం ఏది? అసలు మీరు పోలీసు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అని ప్రశ్నించేవారు". "గ్రామంలోని మహిళా సమస్యలు, పిల్లల మంచి చెడులు, కుటుంబాల్లో కలహాలు, అనుమానాస్పద విషయాలు పట్టించుకుంటే... రాజకీయాలు చేస్తున్నారా అంటూ మమ్మల్ని నిలదీసేవారు. అయితే ఇదంతా యూనిఫాం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య. అదే యూనిఫాంతో మేం ఇదే పని చేస్తే గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వచ్చుండేది కాదు".

 
'యూనిఫాం, డిజిగ్నేషన్ విషయంలో మాలోనే వర్గాలు'
‘‘యూనిఫాం వేసుకుని పని చేయడానికి కొంత మందికి ఇష్టం లేదు. మహిళా పోలీసు అనే పేరు విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహిళా పోలీసంటే కానిస్టేబుల్ స్థాయే కాబట్టి, ఇంత చదువుకుని కానిస్టేబుల్ జాబ్ చేయాలా? మేం చదివితే ఎస్సైలుగా ఉద్యోగాలు పొందేవాళ్లం, అని కొందరన్నారు. ఏది ఏమైనా యూనిఫాం అనేది గుర్తింపు ఇస్తుంది. రకరకాల వాదనలు, చర్చలు తర్వాత యూనిఫాం కోసం క్లాత్, అలాగే కుట్టడం కోసం కొలతలు తీసుకున్నారు. యూనిఫాం అయితే కచ్చితంగా ఉండాలి. యూనిఫాం ఉన్నప్పుడు, లేనప్పుడు మాతో మాట్లాడే తీరులో స్ఫస్టమైన తేడా కనిపిస్తుంది".

 
'మాకు సమస్యలు చెప్పడం... నాయకులకు కోపం తెప్పించింది'
"మహిళా పోలీసులు ఎక్కువ మంది పని చేసేది పల్లెల్లోనే. తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, గ్రూపు తగాదాలు లాంటి విషయాల్లో పరిష్కారం కోసం చాలా మంది స్థానిక రాజకీయ నాయకుల వద్దకే వెళతారు. వారు ఇరు పక్షాలతో మాట్లాడటం, దానికి ఏదైనా పరిష్కారం చెబుతూ ఉంటారు. అక్కడ కూడా సెటిల్ కాకపోతేనే పోలీసుల దగ్గరకు వెళతారు". "మహిళా పోలీసులుగా మేం వచ్చిన తర్వాత గ్రామంలో జరిగే ఏ సమస్యైనా ముందుగా మా దృష్టికి తెస్తున్నారు. దీంతో ఇది నాయకులకు ఇబ్బందిగా మారడంతో, తొలుత వ్యతిరేకించారు. పోలీసుమంటూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారా అన్నారు. వాళ్లకు మా అధికారులు వివరంగా చెప్పడంతో ఇప్పుడు అది తగ్గింది".

 
‘‘మాది హోం శాఖే. మా అపాయింట్ మెంట్ ఆర్డర్, ఐడీ కార్డు అన్నీ హోం ఆ శాఖ నుంచే వచ్చాయి. మాకు సెలవు కావాలన్నా పోలీసు స్టేషన్‌లో ఉన్నతాధికారులే మంజూరు చేస్తారు. జీతాల వరకు పంచాయితీ రాజ్ వాళ్లు ఇప్పటి వరకు ఇస్తున్నారు. అయితే ప్రొబేషన్ పూర్తయితే జీతాలు హోం డిపార్ట్‌మెంట్‌కే మారుస్తామని చెప్తున్నారు. మేం మొదట్నుంచి హోంశాఖ ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాం". "మహిళా పోలీసుకు ఒక జాబ్ చార్ట్ ఉంటుంది. దాని ప్రకారం మేం ఏం చేయాలో ఉంటుంది. ఆ పని పూర్తి చేసి, దాని రిపోర్టును మా పీఎస్ అధికారులకే అందిస్తాం. అయితే స్టేషన్‌లో పనిచేసే మహిళా పోలీసుల్లా కాకుండా మాది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఉద్యోగం. అంటే సచివాలయం ఎంత వరకు ఉంటే అంత వరకే మా జాబ్. ఆ తర్వాత ఏదైనా సమాచారం వస్తే దానిని పీఎస్‌కు ఫార్వర్డ్ చేస్తాం" అని అన్నారు.

 
'జీతం తక్కువే...అయినా...'
"మహిళా పోలీసుగా పని చేస్తున్న మాతో పాటు సచివాలయంలో పని చేస్తున్న వారందరికి నెలకు రూ. 15 వేలు జీతం ఇస్తున్నారు. ఇది అందరికి సరిపోకపోవచ్చు. స్థానికంగా ఉన్నవారికి కొంత ఫర్వాలేదు. కానీ దూరం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం ఇది సరిపోదు. ఎందుకంటే ఇంటి అద్దె, ఇతర ఖర్చులకే చాలా వరకు పోతుంది. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే నమ్మకంతో పని చేస్తున్నాం. ప్రొబేషన్ అయిపోతే జీతంతోపాటు రెగ్యులర్ కూడా అవుతుందని మేమంతా భావిస్తున్నాం".

 
'విధి నిర్వహణలో రిస్క్ ఉంది'
"మేం గ్రామగ్రామానికి తిరుగుతూ ఉంటాం. ఒంటరిగానే వెళుతూ ఉంటాం. పల్లెలు కావడంతో ఎక్కువగా దారుల్లో అలికిడి ఉండదు. గ్రామం నుంచి మరో గ్రామానికి చేరే దారులు కూడా పొదలు, గుబురులతో నిండి ఉంటాయి. అలాంటి సమయంలో కాస్త భయంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రామాల్లో చాలా పరిచయాలు పెరగడంతో... ఏదైనా అనుమానం వస్తే ఎవరికైనా ఫోన్ చేయవచ్చుననే ధైర్యం ఉంది". "ఊర్లో గొడవలు జరిగినప్పుడు అక్కడికి ముందుగా మేమే వెళ్తాం. అక్కడ తాగిన మైకంలో కొందరు మీదకు వస్తుంటారు. అలాంటివి ఎదుర్కొవడం అలవాటైపోయింది. మహిళా పోలీసుగా పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో కొందరు చదువుకు తగ్గ ఉద్యోగం కాదని మానేశారు కూడా. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. మేం చేసిన కౌన్సెలింగ్ వల్ల, మా విధి నిర్వహణ వల్ల ఎవరికైనా ఫలానా మంచి జరిగిందని తెలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది".

 
'విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి'
సచివాలయం మహిళా పోలీసుల యూనిఫాం, రెగ్యులర్ చేయడం వంటి అంశాల గురించి బీబీసీ ఒక సీనియర్ పోలీస్ అధికారిని అడిగింది. ఇది విధానపరమైన నిర్ణయమని, దానిపై తాము స్పందించలేమని చెప్పారు.