ఎన్నికల్లో ఓటు వేసేటపుడు.. రాజకీయ పార్టీ కన్నా, ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా.. స్థానిక అభ్యర్థి ఎవరన్నదే ఓటర్లకు ముఖ్యమని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) సర్వే చెప్తోంది. ఎన్నికల సందర్భంగా ఓట్ల కొనుగోలు కోసం పంచే నగదు, బహుమతులకు అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ సర్వేలో వెల్లడైంది.
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లే పాలకులను ఎన్నుకుంటాయి. ప్రజల ఓటింగ్ ప్రవర్తనకు సంబంధించి పలు అంశాలను విశ్లేషించటానికి సర్వేలో ప్రయత్నించామని ఏడీఆర్ పేర్కొంది. ఓటింగ్ ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులపై ప్రజల అభిప్రాయం, నేరం, డబ్బు పాత్ర గురించి ఓటరు అవగాహన అనే అంశాలపై ప్రజల స్పందనను తాజా నివేదికలో వివరించింది. ఆ సర్వేలో ప్రశ్నలు, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వచ్చిన సమాధానాలను వెల్లడించింది.
ఒక అభ్యర్థికి ఓటు వేయడానికి కారణాలు ఏమిటి?
అత్యధిక శాతం ఓటర్లు తాము ఓటు వెయ్యడానికి ముఖ్య కారణం.. స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్థి ఎవరు అన్నదేనని చెప్పారు (ముఖ్య కారణం: 64% మంది, చాలా ముఖ్యం: 14% మంది).
రెండో కారణంగా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమని చెప్పారు (ముఖ్య కారణం: 35% మంది, చాలా ముఖ్యం: 42% మంది).
మూడో కారణంగా.. అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అని చెప్పారు (ముఖ్య కారణం: 40% మంది, చాలా ముఖ్యం: 31% మంది).
ఇక ఒక అభ్యర్థికి ఓటు వెయ్యడంలో 16% ఓటర్లకు నగదు పంపిణీ, మద్యం, బహుమతులు మొదలైనవి కారణాలుగా (ముఖ్య కారణం 9% మంది, చాలా ముఖ్యం 7% మంది) ఉన్నాయి.
ఓటు వేయటానికి ఎవరి అభిప్రాయం అత్యంత నిర్ణయాత్మకం?
ఎన్నికల్లో ఏ అభ్యర్థి కి ఓటు వెయ్యాలి అన్న నిర్ణయం తీసుకోవడంలో 84% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ సొంత అభిప్రాయం ముఖ్యం అని ఏడీఆర్ సర్వేలో చెప్పారు.
ఆ తరువాత కుటుంబ సభ్యుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు 7 శాతం మంది ఉన్నారు.
ఇక తమ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించి వారు చెప్పినట్లు ఓటు వేసే వారు 6 శాతంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది.
క్రిమినల్ రికార్డులు ఉన్న అభ్యర్థులకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు?
ఇక ఎన్నికలలో పోటీ చేస్తున్న వారిలో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఓటర్ల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవటానికి కూడా ఏడీఆర్ పలు ప్రశ్నలు అడిగింది.
''క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పార్లమెంటు, అసెంబ్లీల్లో ఉండవచ్చా'' అని అడిగిన ప్రశ్నకు.. 98% మంది ఓటర్లు నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులు చట్టసభల్లో ఉండకూడదు అని చెప్పారు.
నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఎందుకు ఓటు వేస్తారు అని అడిగినపుడు.. 37% మంది ఓటర్లు సదరు అభ్యర్థి వేరే మంచి పనులు చేసినందుకు అని అభిప్రాయపడ్డారు.
నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఓటు వెయ్యడంలో కుల, మతపరమైన అంశాలు కూడా కీలకమని 36% మంది ఓటర్లు చెప్పారు.
నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఓటు వెయ్యడానికి ఇంకో కారణం.. వారి మీద ఉన్న కేసులు తీవ్రమైనవి కాకపోవడమని మరో 36% మంది ఓటర్లు స్పందించారు.
ఇక సదరు అభ్యర్థుల నేర నేపథ్యం గురించి సమాచారం లేకపోవడం.. అటువంటి అభ్యర్థులకు ఓటు వెయ్యటానికి మరొక కారణంగా ఇంకో 36% మంది పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర సమాచారం పొందగలరని మీకు తెలుసా'' అని అడిగినపుడు.. కేవలం 35% ఓటర్లకు మాత్రమే అభ్యర్థుల క్రిమినల్ రికార్డుల సమాచారాన్ని పొందవచ్చని తెలుసునని చెప్పారు.
ఎన్నికల్లో డబ్బు/బహుమతులు పంపిణీపై జనం ఏమంటున్నారు?
ఎన్నికల్లో డబ్బు పాత్ర గురించి ఓటరు అవగాహనను అంచనా వేయడానికి కూడా ఏడీఆర్ ప్రయత్నించింది.
ఓటర్లలో చాలా మందికి.. అంటే 73% మందికి - ఎన్నికల్లో నగదు పంపిణీ, బహుమతులు ఇవ్వటం వంటివి చట్టవిరుద్ధం అని తెలుసని ఏడీఆర్ సర్వేలో వెల్లడైంది.
గత ఎన్నికల సమయంలో నగదు/డబ్బు పంపిణీ/మద్యం పంపణీ గురించి మీకు అవగాహనా ఉన్నదా? అని ఏడీఆర్ ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు.. 38% మంది ఓటర్లు.. ఎన్నికల్లో నగదు, బహుమతులు తదితరాలను ఓటర్లకు పంచిన సందర్భాలు తెలుసునని బదులిచ్చారు.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ RA అస్టేరిస్క్స్ కంప్యూటింగ్ అండ్ డేటా సొల్యూషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ (RAAC)తో కలిసి 2018 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఈ ఓటరు సర్వే నిర్వహించినట్లు వెల్లడించింది.
''ఈ సర్వేని ఉత్తమమైన శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి నిర్వహించడం జరిగింది'' అని చెప్పింది. జనాభాలో గ్రామీణ - పట్టణ నివాసం, లింగం, కులం, మతం, ఆదాయ వర్గాల వారీగా తగిన ప్రాతినిధ్యం ఉండే విధంగా 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళను ఈ సర్వే కోసం ఎంపిక చేసినట్లు తెలిపింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 61% మంది గ్రామీణ ప్రాంతాల నుండి, 39% పట్టణ ప్రాంతాల నుండి ఉన్నారని; 62% మంది పురుషులు, 38% మంది మహిళలు; 72% మంది జనరల్, 7% ఓబీసీ, 16% ఎస్‌సీ, 5% ఎస్‌టీ వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పింది. సర్వే నిష్పాక్షికంగా ఉండేలా ప్రతి జాగ్రత్త తీసుకున్నామని, సర్వే కచ్చితత్వం 95 శాతమని పేర్కొంది.