శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2022 (12:42 IST)

'స్నేహానికి దేశాలు, సరిహద్దులు లేవు' - పాక్ మహిళతో స్నేహం గురించి భారతీయ మహిళ షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసలు

Bharat-Pakistan
ఒక భారత మహిళ, తన పాకిస్తానీ క్లాస్‌మేట్‌తో తన స్నేహం గురించి రాసిన ఒక పోస్ట్.. సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. వారిద్దరూ హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ విద్యార్థులు. ఇరువురూ తమ తమ దేశాల జెండాలు పట్టుకుని దిగిన ఫొటో ఈ పోస్టులో కనిపిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఒక విద్యార్థినితో తన స్నేహం..తమ పొరుగుదేశం గురించి తాను విన్న మూస అభిప్రాయాలను పటాపంచలు చేశాయని భారతీయ మహిళ స్నేహా బిస్వాస్ తన పోస్టులో రాశారు.

 
పాకిస్తాన్ కళాకారులు, క్రికెటర్లు భారత్‌లో ప్రదర్శనలు ఇవ్వరాదని, ఆడరాదని భారత్ నిషేధించింది. బాలీవుడ్ సినిమాలను పాక్‌లో ప్రదర్శించరాదంటూ పాకిస్తాన్ నిషేధించింది. ఈ ఫొటోలో ప్రదర్శించిన సమైక్యత పట్ల ఓ యూజర్ హర్షం వ్యక్తం చేస్తూ.. ''మన ఇరువురి మధ్య గోడలు నిర్మించింది మనమే. వాటిని ధ్వంసం చేయాల్సిందీ మనమే'' అని కామెంట్ చేశారు. ఈ ఇద్దరు మహిళలూ ''ఈ స్నేహాన్ని జీవితాంతం కొనసాగించాలని, దానిద్వారా ఇరువైపులా సరిహద్దులకు అతీతంగా బాలికల జీవితాల్లో మార్పు రావచ్చు''నని మరొక యూజర్ ఆకాంక్షించారు.

 
స్నేహా బిశ్వాస్ వ్యాపారవేత్త కూడా. పాకిస్తానీ క్లాస్‌మేట్‌తో తన దోస్తీ గురించి వివరిస్తూ ఈ ఫొటోను ఆమె లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. అందులో తన స్నేహితురాలి పేరు చెప్పలేదు. ఓ చిన్న పట్టణంలో పెరుగుతున్న దశలో.. పాకిస్తాన్ గురించి, అక్కడి ప్రజల గురించి తనకు తెలిసింది చాలా తక్కువేనని ఆ పోస్టులో ఆమె రాశారు. తనకు తెలిసే సమాచారమంతా పుస్తకాలు, మీడియా ద్వారానే తెలిసేదని.. ఆ కథనాలు తరచుగా విద్వేషం గురించి, శత్రుత్వం గురించే చెప్పేవని పేర్కొన్నారు.

 
హార్వర్డ్ యూనివర్సిటీలో మొదటి రోజునే ఇస్లామాబాద్ నుంచి వచ్చిన క్లాస్‌మేట్‌ను కలిశానని.. అప్పటి నుంచీ తమ ఇద్దరి మధ్యా స్నేహం బలపడిందని వివరించారు. తామిద్దరం టీ తాగుతూ, బిర్యానీ తింటూ ఎన్నోసార్లు మాట్లాడుకున్నామని..తన స్నేహితురాలి నేపథ్యం కూడా తన నేపథ్యం వంటిదేనని తెలుసుకున్నానని చెప్పారు. 'సంప్రదాయవాద పాకిస్తానీ నేపథ్యంలో' పెరిగిన యువతికి, ఆమె కలలను సాకారం చేసుకోవటానికి కుటుంబం మద్దతుగా నిలవటం ఆ నేపథ్యమన్నారు.

 
''మనమన వ్యక్తిగత దేశాల పట్ల గర్వం బలంగా ఉన్నాకూడా.. జనం పట్ల మన ప్రేమకు భూభాగాలు,
సరిహద్దులు ఉండవని నాకు అవగతమైంది'' అని చెప్పారామె. ''హద్దులు, సరిహద్దులు, ప్రాంతాలు మనుషులు నిర్మించినవి'' అంటూ ప్రజల మధ్య ఐక్యత ఉంటుందని ఆమె పోస్ట్ ఉద్ఘాటించింది. కేవలం ఈ రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా.. నక్షత్రాలను చేరుకునే కలలు కనటానికి భయపడే ఇరు దేశాల బాలికల కోసం కూడా ''అవరోధాలను బద్దలు కొట్టాల''ని ఆమె వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్‌ల స్వతంత్ర దినోత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో స్నేహా బిశ్వాస్ పోస్టు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.

 
1947లో బ్రిటిష్ ఇండియా విభజనతో స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన పాకిస్తాన్ ఆగస్టు 14వ తేదీన, భారత్ ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటాయి. ఆ నాటి ఉపఖండ విభజన చరిత్రలో అత్యంత రక్తసిక్త పరిణామాల్లో ఒకటిగా నిలిచింది. ఆ విభజన నుంచే భారత్, పాక్‌ల మధ్య శత్రుత్వానికి పునాదులు పడ్డాయని నిపుణులు చెప్తారు.