బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (14:32 IST)

ఆసియాలోనే ఎక్కువ కాలం జీవించిన రాణి ఏనుగు మృతి!

హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో 83 ఏళ్ల రాణి అనే ఏనుగు మంగళవారం మరణించింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ జూలో ఉన్న అన్ని జంతువులకంటే రాణి వయసులో పెద్దది. ఇది 1938 అక్టోబర్ 7న పుట్టింది. 1963లో ఈ ఏనుగును నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి నెహ్రూ జూ కి తీసుకువచ్చారు. 
 
హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల వేడుకలు, మొహర్రం ఊరేగింపుల్లో రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఆసియాలో ఎక్కువ కాలం జీవించిన ఏనుగుల్లో రాణి మూడోది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు దగ్గరున్న 88 ఏళ్ల చెంగళ్లూర్ దాక్షాయణి అనే ఆడ ఏనుగు ఎక్కువ కాలం జీవించగా, లిన్ వ్యంగ అనే 86 ఏళ్ల మగ ఏనుగు దాని తర్వాత స్థానంలో నిలిచింది.
 
ఇప్పుడు రాణి చనిపోవడంతో హైదరాబాద్ జూలో నాలుగు ఆసియా ఏనుగులే మిగిలాయి. బుధవారం హైదరాబాద్ జూలో 21 ఏళ్ల చిరుతపులి కూడా చనిపోయింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి 2000 సంవత్సరంలో హైదరాబాద్ జూకు తీసుకువచ్చారు. 
 
ముంబైలో కూలిన మూడంతస్తుల భవనం, 11 మంది మృతి 
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ మలాడ్‌లోరద్దీగా ఉండే ఒక ప్రాంతంలో ఒక మూడంతస్తుల భవనం కుప్పకూలింది. బుధవారం రాత్రి 11 గంటలకు జరిగిన ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
 
భవనం కూలిపోవడంతో, దాని చుట్టుపక్కల మరో మూడు ఇళ్లను ఖాళీ చేయించినట్లు బీఎంసీ చెప్పింది. అవి కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ ఘటనలో గాయపడినవారిని బీడీబీఏ మునిసిపల్ ఆస్పత్రికి తరలించారు. భవనం కూలిన సమయంలో లోపల పిల్లలుసహా చాలామంది ఉన్నారు.
 
అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సాయంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అవి ఉదయం కూడా కొనసాగాయి. "మూడంతస్తుల భవనం పక్కనే ఉన్న మరో భవనం మీద కూలిపోయింది. శిథిలాల నుంచి 18 మందిని బయటకు తీసుకొచ్చాం. వారిలో 11 మంది చనిపోయారు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు" అని అదనపు పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ ఏఎన్ఐకు చెప్పారు.