1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2022 (23:14 IST)

భారత ఆర్థికవ్యవస్థ: ‘‘జీతాలు పెరగలేదు.. అద్దెలు, ధరలు, చార్జీలు అన్నీ పెరిగిపోయాయి.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’

vegetables
‘ ‘నిజంగా మేము ఏ రోజుకి ఆ రోజూ పూట గడుపుతున్నాం. వేతనాలు అలానే ఉన్నాయి. కానీ, ఖర్చులు మాత్రం రెండింతల మేర పెరిగాయి’’. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు శాంటాను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీశాయి. జూన్ నెలలో ఆమె అద్దెకుండే ఇంటి యజమాని, నెలవారీ రెంట్‌ను మూడింట రెండొంతులు పెంచారు. ఇది ఆమె కుటుంబంపై నేరుగా ప్రభావం చూపించింది.
 
శాంట 32 ఏళ్ల సోషల్ వర్కర్, టీచర్. భర్తతో కలిసి బెంగళూరులోని హైటెక్ సిటీలో నివసిస్తోంది. తమ సొంత ఖర్చులను చూసుకుంటూనే, వారి కుటుంబాలను కూడా వారే పోషిస్తున్నారు. ఐదుగురు సభ్యులున్న తన కుటుంబానికి ఎంతో కొంత ఆదాయాన్ని అందించేది శాంట మాత్రమే. ఖర్చులను భరించేందుకు ఆమె అదనపు ఆదాయం కోసం రెండు ఉద్యోగాలను చేయాల్సి వస్తోంది. శాంట వాళ్ల ఇంటి యజమాని ఒక్కసారిగా నెలవారీ ఇంటి అద్దెను రూ. 7 వేల నుంచి రూ. 11,500కి పెంచారు. కరోనా మహమ్మారి సమయంలో అద్దెను పెంచకపోవడంతో.. ఒకేసారి ఈ భారాన్ని ఇప్పుడు వారిపై వేశారు. కానీ, అద్దెలు పెంచేందుకు ఇది సరియైన సమయం కాదని శాంట అన్నారు.
 
గత ఏడాది కాలంగా నిత్యావసర వస్తువుల, ఆహారాల ధరలు రెండింతల మేర పెరిగాయి. ముఖ్యంగా భారీగా పెరిగిన ఆహారం, ఇంధన ధరలు గృహవసరాల బడ్జెట్లను భారీగా ప్రభావితం చేశాయి. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టానికి చేరినప్పటికీ, అది ప్రజలకు కేవలం స్వల్ప ఊరటను మాత్రమే ఇచ్చింది. ప్రస్తుతం కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 20 వేలుగా ఉన్న వాళ్లు తమ ఖర్చులను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వారు తమ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలి. కొన్ని నిత్యావసరాలను కూడా వారు వదులుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
 
‘‘నా తల్లిదండ్రులకు టీ అంటే చాలా ఇష్టం. కానీ, గత ఏడాది కాలంగా వారు పాలు లేకుండానే టీ తాగుతున్నారు. మాకు ఎంత కావాలో అంతే పరిమాణంలో అంటే పరిమిత క్వాంటిటీలో మాత్రమే నేను సరుకులు కొంటున్నాను. కానీ, ప్రతి రోజూ ఉదయాన్నే కొనే పాలు, కూరగాయలు, మాంసం వంటి నిత్యావసర ఖర్చులను మాత్రం తప్పించుకోలేకపోతున్నాం. వాటిని తప్పక కొనాల్సిందే కదా’’ అని శాంట చెప్పారు. సామాజిక కార్యకర్తగా శాంట తన ఉద్యోగంలో భాగంగా నగరమంతా తిరగాల్సి ఉంటుంది. ఇదే సమయంలో బస్సు టిక్కెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ‘‘అంతకుముందు డైలీ బస్సు పాస్ ధర రూ. 30గా ఉంటే, అది ఇప్పుడు రూ. 90కి పెరిగింది’’ అని శాంట అన్నారు.
 
పరిమిత ఆదాయంతో జీవనం సాగించే శాంట కుటుంబాన్ని కరోనా మహమ్మారి తీవ్ర దెబ్బకొట్టింది. వారి ఆదాయ వనరులను భారీగా ప్రభావితం చేసింది. ‘‘నా దగ్గర ప్రస్తుతం దాచుకున్న డబ్బు లేదు. గత ఏడాది మా నాన్న అనారోగ్యానికి గురైనప్పుడు నా బంగారు నగలన్నీ తనాఖా పెట్టాను’’ అని శాంట తెలిపారు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సప్లయి చెయిన్‌లో తలెత్తిన అంతరాయాలు ప్రతి ఒక్కదాన్ని ఖరీదైనవిగా మార్చాయి. ఇవి భారత్‌లో వినియోగ విధానాలను పూర్తిగా మార్చేశాయి. ప్రజలకు నిత్యావసరాలను సైతం భారంగా మార్చాయి. ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కుటుంబాలు బాగా ప్రభావితమయ్యాయి.
 
అయితే, భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో రెండు కోణాలు కనిపిస్తున్నాయనడంలో వాస్తవం లేకపోలేదు. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు, పెద్ద కంపెనీల బలమైన త్రైమాసికపు ఫలితాలు దేశ ఆర్థిక వృద్ధి మళ్లీ పుంజుకుంటుదన్న విషయాన్ని తెలియజేస్తుంటే, మనం కాస్త పరిశీలించి చూస్తే ఆర్థిక అంతరాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చాలా వినియోగదారుల ఉత్పత్తుల కంపెనీలకు అమ్మకాలు పడిపోయాయి. ఫుట్‌వేర్ నుంచి మొబైల్ ఫోన్లు, బిస్కెట్ల వరకు ప్రతి ఎంట్రీ లెవల్ వస్తువు అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఉత్పత్తులతో పోలిస్తే ఖరీదైన బ్రాండ్ల అమ్మకాలు మాత్రమే కాస్త మెరుగ్గా ఉన్నాయి.
 
వినియోగ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైన సెప్టెంబర్, అక్టోబర్ పండగ సీజన్‌లో కూడా హై ఎండ్ ప్రొడక్టులు మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఎంట్రీ లెవల్ ప్రొడక్టులకు చెందిన అన్ని కేటగిరీల ఉత్పత్తుల అమ్మకాలు 10 శాతం వరకు తగ్గిపోయాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భారత ఈ-కామర్స్ మార్కెట్ రూ. 755 వందల కోట్ల అమ్మకాలతో పండగ సీజన్‌ బలంగా ఉందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. అయితే, ఒక్కో వినియోగదారు సగటు వ్యయం మాత్రం స్తబ్దుగా నమోదైందని ఈ నివేదికలో వెల్లడైంది.
 
కరోనాతో రెండేళ్ల పాటు పండగ కాలమంతా పూర్తిగా లాక్‌డౌన్లతో ముగిసిపోయిన తర్వాత, భారతీయులు ఇప్పుడే పూర్తి తరహాలో పండగలను సెలబ్రేట్ చేసుకున్నారు. వీధులన్నీ కాంతి దీపాలతో వెలిగిపోయాయి. ప్రజలు తమ ఇళ్లను ఎలక్ట్రిక్ విద్యుత్ కాంతులతో, దీపాలతో అలంకరించుకున్నారు. కానీ, చాలా మంది ఇళ్లలో మునుపటి ఏళ్లతో పోలిస్తే సెలబ్రేషన్స్ కాస్త భిన్నంగా సాగాయి. ధరలు భారీగా పెరగటం వల్ల కొందరు కన్జూమర్లు మాత్రమే పండగలను సెలబ్రేట్ చేసుకున్నారు. పెరిగిన జీవన వ్యయాల ప్రభావం దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివాసముండే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.
 
సారిక 47 ఏళ్ల గృహిణి. దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో పెద్ద ఎత్తున జరిగిన దీపావళి పండగ కోసం ఆమె తన పాత బట్టలను రీసైకిల్ చేశారు. పండగలకు కొత్త బట్టలు కొనడం ఆనవాయితీ అయినప్పటికీ, బట్టల నుంచి స్వీట్లు, ఇతర బేసిక్ ఆహార పదార్థాల వరకు ప్రతి దానిలో తాము ఖర్చులను తగ్గించుకున్నట్టు సారిక చెప్పారు.
గత ఏడాది కాలంగా సారిక ఫుడ్ బిల్లులు సుమారు రెండింతలు పెరిగాయి. ‘‘వంటనూనెల నుంచి గోధుమలు, చిరుధాన్యాలు, కూరగాయల వరకు ప్రతిదీ 30 శాతం నుంచి 50 శాతం వరకు ఖరీదైనవిగా మారాయి. గత ఏడాది కాలంగా కుటుంబ ఖర్చులు రెండింతలయ్యాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ కొత్త బట్టలు కొనేంత స్తోమత మాకు లేదు’’ అని సారిక చెప్పారు.
 
ఖర్చులు పెరిగినంత స్థాయిలో సారిక కుటుంబ ఆదాయం పెరగలేదు. ఆమె భర్త వాచ్‌ల షాపుకి కస్టమర్ల రాక తగ్గింది. దుకాణానికి కస్టమర్ల రాక తగ్గడంతో, చాలా వాచ్‌లు అమ్ముడుపోలేదు. ఆ పాత వాచ్‌లను వారు తప్పనిసరి పరిస్థితిలో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. అంతేకాక, అకాల వర్షాలతో వారి వ్యవసాయ పంటలు కూడా దెబ్బతిన్నాయి. ‘‘ఈ సమయంలో నేను నిత్యావసరాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాక నా ముగ్గురు పిల్లలకు స్కూల్, కాలేజీ ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఇతర ఖర్చులతో పోలిస్తే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను’’ అని ఆమె తెలిపారు.
 
ముంబైకి 150 కి.మీల దూరంలో ఉండే పుణె నుంచి కూడా తమ కొడుకు ఈ దీపావళికి రాలేకపోవడంతో ఈ పండగ తమకేమీ పెద్దగా ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇవ్వలేదని సారిక అన్నారు. బస్సు చార్జీలు రెండింతలు పెరగడంతో ఆమె కొడుకు ఈ పండక్కి ఇంటికి రాలేకపోయాడని తెలిపారు. బస్సు చార్జీల మనీని ఆదా చేసుకుని, ఆ మొత్తాన్ని ఆ నెల హాస్టల్ బిల్లులను చెల్లించడానికి ఉపయోగించుకున్నట్లు చెప్పారు. జీవితంలో జరిగే చిన్న చిన్న వేడుకలను సైతం ఎంజాయ్ చేయలేకపోయినప్పుడు చాలా బాధపడాల్సి వస్తోందని, ఇది కేవలం తమ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడం కారణంగానేనని సారిక అన్నారు.
 
పెరుగుతున్న జీవన వ్యయాలు ప్రజలను భారీగా దెబ్బకొడుతున్నాయి. ఈ వ్యయ భారాలు తమకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోతుండటంతో.. భవిష్యత్‌లో కూడా మధ్యతరగతి ప్రజలు కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శాంట, ఆమె భర్తకి పెళ్లై ఇప్పటికి మూడేళ్లు. వారు బెంగళూరులో కొత్త ఇంటిని తీసుకుని, ఫ్యామిలీ పెట్టాలనుకున్నారు. కానీ, వారి ఆ కలలన్నీ ఇప్పుడు కల్లలయ్యాయి. ‘‘మేమే బతికేందుకు ఇబ్బందులు పడుతుంటే, ఇక ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పోషించగలం’’ అని శాంట అన్నారు.