మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (12:44 IST)

తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడు.. సుపారీ ఇచ్చి చంపించిన తల్లిదండ్రులు

murder
వ్యసనాలకు బానిస అయిన కన్నబిడ్డే తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు కావాలంటూ నిత్యం వేధించసాగాడు. దీంతో అతని పీడ వదిలించుకునేందుకు తల్లిదండ్రులే కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి చంపించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం పట్టణానికి చెందిన రామ్ సింగ్, రాణిభాయి దంపతులకు ఓ కుమారుడు సాయినాథ్ (22). కుమార్తె ఉంది. రామ్ సింగ్ సత్తుపల్లిలోని రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపాల్‍‌గా పని చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సాయినాథ్ వ్యసనాలకు బానిసయ్యాడు. 
 
దీంతో డబ్బు కోసం నిత్యం తల్లిదండ్రులను వేధించసాగాడు. ఈ వేధింపులను తల్లిదండ్రులు సహించలేకపోయారు. ఒక రోజున ఈ వేధింపులు శృతిమించడమేకాకుండా తల్లిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని తుదముట్టించాలన్న నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందుకోసం రామ్ సింగ్ దంపతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటున్న రాణిభాయి సోదరుడు సత్యనారాయణ సింగ్‌ను సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ రమావత్ రవికి విషయం చెప్పిన సత్యనారాయణ సింగ్.. సాయినాథ్‌ను అంతమొదించాలని ప్లాన్ చేశారు. దీంతో రమావత్ రవి అదే తండాకు చెందిన పనుగోతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురాం మండలం రాజేంద్ర నగర్‌కు చెందిన ధనావత్‌లతో రవి రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
వీరంతా కలిసి ఓ ప్లాన్ ప్రకారం... గత నెల 18వ తేదీన సత్యనారాయణ సింగ్, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ ఆలయం వద్ద దావత్ చేసుకుందామని సాయినాథ్‌ను నమ్మించి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు. శవాన్ని తమ కారులోనే తీసుకెళ్లి మూసీ నదిలో పడేశారు. ఆ తర్వాత రోజు నదిలో శవం కనిపించడంతో స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
పిమ్మట మూడు రోజుల తర్వాత తమ కుమారుడు చనిపోయినట్టు మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తెలిసిందని పేర్కొంటూ తల్లిదండ్రులు వచ్చి సాయినాథ్ శవాన్ని తీసుకెళ్లారు. అయితే, పోలీసుల దర్యాప్తులో హత్య జరిగిన రోజు శూన్యం పహాడ్‌ వద్ద సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన కారు, మృతుడి తల్లిదండ్రులు తీసుకొచ్చిన కారు ఒక్కటేనని గుర్తించిన పోలీసులు... ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తమ కుమారుడి వేధింపులు భరించలేక తామే సుపారీ ఇచ్చి హత్య చేయించామని రామ్ సింగ్ రాణిభాయి దంపతులు వెల్లడించారు. దీంతో సాయినాథ్ తల్లిదండ్రులతో పాటు మేనమామ సత్యనారాయణ సింగ్, మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.