గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (13:15 IST)

కేబుల్ వంతెన కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబీకులు 12 మంది మృతి

cable bridge
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై ఉన్న పురాతన కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 140 దాటిపోయింది. ఈ మృతుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్‌‍కోట్ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ కుటుంబ సభ్యులు 12 మంది ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరంతా మోహన్ భాయ్ సోదరి తరపున బంధువులుగా గుర్తించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో కేబుల్ వంతెనపై సుమారుగా 500 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో వంతెన తెగిపోవడంతో వారంతా మచ్చూ నదిలో పడ్డారు. వీరిలో ఈత తెలిసినవారు ఈదుకుంటూ గట్టుకు చేరుకోగా మరో 170 మంది సహాయక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య 141కు చేరింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమైవున్నాయి.
 
మరోవైపు, ఒకేసారి 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో తాను 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్టు తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన బోరున విలపించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోందన్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు.