సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (20:08 IST)

జపనీస్ మకాక్: ప్రజలపై దాడి చేస్తున్న కోతిని చంపిన అధికారులు

Japanese macaque
జపాన్‌లోని యమగూచి ప్రాంతంలో కోతుల మూక ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ మూకలో ఒక కోతి గత కొన్ని వారాలుగా ప్రజలను మరింత ఎక్కువగా భయపెడుతోంది. ఈ కోతిని చివరకు బంధించి హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కోతి యమగూచిలో దాదాపు 50 మందిని గాయపరిచింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన వేటగాళ్లు మంగళవారం సాయంత్రం హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈ కోతిని చూశారు. దాడులు చేస్తున్నకోతి అదే అని తేలడంతో, దానికి మత్తుమందు ఇచ్చి బంధించారు.

 
మూడు వారాల క్రితం స్థానికులపై కోతుల దాడులు మొదలైనప్పటి నుంచి ఈ కోతుల కోసం అధికారులు గాలిస్తున్నారు. కోతుల దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. కొందరిని గోళ్లతో రక్కగా, మరికొందరిని కరిచి గాయపరిచాయి ఈ కోతులు. కోతులు దాడులు చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. కోతుల మూకలోని మిగిలిన కోతుల కోసం కూడా వెతుకులాట కొనసాగిస్తున్నట్లు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

 
ఈ కోతిని బంధించిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు. అధికారులు బంధించిన కోతికి నాలుగేళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. ఇది సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. జపనీస్ మకాక్‌ అనే ఇలాంటి కోతులు ఆ దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇవి పంటలను తినేస్తూ, ఇళ్లల్లోకి చొరబడుతూ ఇబ్బంది పెడతాయి. కానీ, యమాగూచిలో జరిగిన దాడులు మాత్రం అసాధారణమైనవి.

 
"ఇంత తక్కువ కాలంలో ఇన్ని దాడులు జరగడం చాలా అరుదైన విషయం" అని ఒక అధికారి తెలిపారు. "మొదట ఒక మహిళ, చిన్నారి పై దాడి జరిగింది. తర్వాత వృద్ధులు, యువతను కూడా లక్ష్యం చేసుకోవడం మొదలయింది" అని చెప్పారు. గతంలో వల వేసి వీటిని బంధించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. జులై మొదటి వారం వరకు ఏర్పాటు చేసిన పోలీసు పెట్రోలింగ్ కూడా విజయవంతం కాలేదు. ఒక కోతి ఒక అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి నాలుగేళ్ల చిన్నారిని గాయపరిచింది. మరో కోతి కిండర్ గార్డెన్ తరగతి గదిలోకి ప్రవేశించింది.

 
ఒకప్పుడు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న జపనీస్ మకాక్‌ల జనాభా ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో, మనుషులకు వీటికి మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతున్నట్లు యమగాతా యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. మనుషుల ప్రవర్తనలో, అటవీ పర్యావరణంలో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితి ఏర్పడటానికి ఒక కారణం అని చెప్పవచ్చు.