శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 28 నవంబరు 2019 (16:54 IST)

మహారాష్ట్ర: అజిత్ పవార్ బీజేపీతో 'గేమ్' ఆడారా?

మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మలుపు అందరినీ ఆశ్చర్యపరిచింది అనేది తెలిసిందే. కానీ అందరినీ ఎక్కువ ఆశ్చర్యపరిచిన వ్యక్తి మాత్రం అజిత్ పవారే. దేవేంద్ర ఫడణవీస్ తన రాజీనామా తర్వాత పెట్టిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ ఆయన్ను "అజిత్ పవార్ బీజేపీతో ఏదైనా గేమ్ ఆడారా?" అని అడిగారు. ఫడణవీస్ "ఆ ప్రశ్నకు సమాధానం అజిత్ పవార్‌నే అడగండి" అన్నారు.

 
అటు శివసేన నేత సంజయ్ రౌత్ "అజిత్ పవార్ తిరిగి పార్టీలోకి వస్తున్నారని" ట్వీట్ చేశారు. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్న కొడుకు. అజిత్ పవార్‌ను ఆయన మద్దతుదారులు ముద్దుగా 'దాదా'(అన్నయ్య) అని పిలుచుకుంటారు. అజిత్ పవార్ ఏమేం చేశారో తెలుసుకోవాలంటే మనం అన్నిటికంటే ముందు శుక్రవారం జరిగిన ఘటనలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

 
శుక్రవారం రాత్రి ముంబైలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సమావేశం జరిగింది. మీడియా రిపోర్టర్ల సమాచారం ప్రకారం ఈ సమావేశం దాదాపు రెండు గంటల వరకూ జరిగింది. తర్వాత అందరికంటే మొదట బయటికి వచ్చిన వారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఆయన మీడియాతో "ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, ఎన్సీపీ ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ పేరును ప్రతిపాదించిందని" చెప్పారు.

 
ఆయన అన్నట్టే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం అయితే చేశారు, కానీ ముఖ్యమంత్రిగా అక్కడ ఉద్ధవ్ ఠాక్రే కాకుండా, దేవేంద్ర ఫడణవీస్ ఉన్నారు. శనివారం ఉదయం వార్తాపత్రికల్లో కూడా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని హెడ్‌లైన్స్ పెట్టారు. కాసేపట్లోనే టీవీపై దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ కనిపించారు. ఆయన పక్కనే కనిపించిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమాణం చేశారు.

 
అది చూడగానే అందరికీ శరద్ పవార్‌పైనే సందేహం వచ్చింది. కొన్ని గంటల ముందు ఇచ్చిన ప్రకటనలో ఆయన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఊహించని ఈ నాటకీయ పరిణామాల మధ్య శరద్ పవార్ "మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి మద్దతు ఇవ్వాలనేది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం. ఎన్సీపీది కాదు, ఆయన నిర్ణయాన్ని సమర్థించడం లేదని మేం అధికారికంగా చెప్పాలనుకుంటున్నాం" అని ట్వీట్ చేశారు.

 
రైతులను ఎగతాళి చేసిన అజిత్ పవార్
ఇక ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశాక అజిత్ పవార్ విలేఖరులతో "మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులైపోయింది. ప్రభుత్వం ఏర్పడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అన్నారు. "రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు, కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది మహారాష్ట్రకు మంచిది" అన్నారు.

 
పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే రైతుల సమస్యలపై విచారం వ్యక్తం చేసిన ఇదే అజిత్ పవార్ 2013లో మహారాష్ట్రలో కరువుతో ఏర్పడిన నీటి కొరత గురించి మీడియా అడిగినప్పుడు వ్యంగ్యంగా "ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోతే, మేం అక్కడికెళ్లి మూత్రం పోయాలా?" అన్నారు అజిత్ పవార్ ఈ మాటను మహారాష్ట్ర రాజధాని ముంబయి ఆజాద్ మైదానంలో రైతుల నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు అన్నారు.

 
ఆయన అప్పుడు "ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోతే నీళ్లు ఎలా వదలగలం. మేం అక్కడికి వెళ్లి మూత్రం పోయాలా, తాగడానికే నీళ్లు లేకపోతే, ఆ మూత్రం కూడా ఎలా వస్తాయి" అన్నారు. ఇంకోసారి, గ్రామాల్లో విద్యుత్ కోతల సమస్యపై మాట్లాడిన అజిత్ పవార్ "నేను చూస్తున్నా, ఇక్కడ రాత్రిళ్లు కరెంటు పోతున్నప్పటి నుంచీ, పిల్లల్ని కనడం ఎక్కువైంది. జనం దగ్గర వేరే పనులేం లేవు" అన్నారు. మహారాష్ట్ర భయంకరమైన కరువుతో అల్లాడుతున్న సమయంలో అజిత్ పవార్ ఈ మాట అన్నారు. అయితే తర్వాత తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. వాటిని "తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు"గా చెప్పారు.

 
కుంభకోణాల్లో అజిత్ పవార్
అజిత్ పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న అనంతరావ్ పవార్ కొడుకు. 60 ఏళ్ల అజిత్ పవార్ మహారాష్ట్ర బారామతి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన పేరు కుంభకోణాల్లో కూడా చిక్కుకుంది. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌క సంబంధించిన 25 వేల కోట్ల రూపాయల స్కాంలో కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం మనీ ల్యాండరింగ్‌కు సంబంధించింది.

 
సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఆగస్టులో ఈడీ ఈ కుంభకోణానికి సంబంధించి ఆయనపై దర్యాప్తు ప్రారంభించింది. అది కాకుండా అజిత్ పవార్‌పై నీటిపారుదల కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఆయన మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయినపుడు జరిగింది. అజిత్ పవార్ ఈడీ బారిన పడకుండా, జైలుకెళ్లకుండా బయటపడాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన బీజేపీ ప్రతిపాదనను అంగీకరించాడని అంటున్నారు. అయితే ఆ కేసుల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి అక్రమాలూ గుర్తించలేదని, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత భారత మీడియా కథనాలు ప్రసారం చేశాయి.

 
ఎన్సీపీకి నేతృత్వం వహించాలనే ప్రయత్నం
సీనియర్ జర్నలిస్ట్ శివం విజ్ అజిత్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వెనక మరో కారణం కూడా చెబుతున్నారు. "ఆయన ఎన్సీపీని చీల్చడంలో సక్సెస్ అయితే, శరద్ పవార్ వారసుడు కావాలని ప్రయత్నిస్తారు. ఆయన సుప్రియా సూలే ప్రత్యర్థిగా మరాఠా ముఖ్య నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తారు" అన్నారు.

 
"అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచీ అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని" రాజకీయ విశ్లేషకులు హేమంత్ దేశాయ్ చెప్పారు.
శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, ఆయన అన్న కొడుకైన అజిత్ పవార్ మధ్య ఎప్పుడూ పడేది కాదు అని చెబుతున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వార్తలు తెలీగానే అజిత్ పవార్ తిరుగుబాటు చేశారని సుప్రియా సూలే చెప్పారు.

 
సుప్రియ తన వాట్సాప్‌లో ఒక స్టేటస్ అప్‌డేట్ పెడుతూ "పార్టీ, కుటుంబం విడిపోయింది: మీరు జీవితంలో ఎవరిని నమ్ముతారు? జీవితంలో ఎవరి దగ్గరా మోసపోలేదు. తనను వెనకేసుకొచ్చాను, ప్రేమించాను... బదులుగా నాకు ఏం లభించిందో చూడండి" అన్నారు. ప్రస్తుతం శరద్ పవార్ అజిత్ పవార్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలగించారు.

 
ఆయన స్థానంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు శాసన సభా పక్షానికి సంబంధించిన అన్ని నిర్ణయాలూ తీసుకునే అధికారం ఇచ్చారు. అయితే, అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి వచ్చారు. సుప్రియా సూలే సహా పార్టీ నాయకులంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తోదని, అజిత్ పవార్‌కే ఆ పదవి ఇస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.