1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:42 IST)

‘మోదీయే 80 శాతం మంది భారతీయుల తొలి ప్రాధాన్యం’.. ప్యూ రీసర్చ్ సెంటర్ నివేదికలో ఇంకా ఏముంది?

Modi
దిల్లీలో ముఖ్యమైన జీ-20 సదస్సుకు ముందుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ, ప్రపంచ దేశాల్లో భారత్ ప్రభావంపై ఓ సర్వే బయటకు వచ్చింది. అమెరికా థింక్ ట్యాంక్ ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ ఈ సర్వేను విడుదల చేసింది. సామాజిక అంశాలు, జనాభా వివరాలపై ఈ సంస్థ సర్వేలు చేస్తుంటుంది. భారత్‌లో జీవిస్తున్న ప్రజల్లో దాదాపు 80 శాతం మంది మోదీ విషయంలో సానుకూల దృక్పథంతో ఉన్నట్లు దీనిలో పేర్కొన్నారు. సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే ప్రతి పది మందిలో ఎనిమిది మంది మోదీనే ప్రధాన మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. 20 శాతం మంది మాత్రం పీఎంగా నరేంద్ర మోదీ తమ తొలి ప్రాధాన్యం కాదని తెలిపారు.
 
మోదీ గురించి విదేశీయులు ఏమనుకొంటున్నారు?
భారత్‌కు వెలుపల దేశాల ప్రజలు ప్రధాని మోదీని ఇష్టపడుతున్నారా? ఆయన్ను వారు నమ్ముతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సర్వేలో సమాధానాలు ఉన్నాయి. దీనిలో 12 ఇతర దేశాల ప్రజలు మోదీ గురించి ఏం అనుకుంటున్నారో ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. సగటున విదేశీయుల్లో 40 శాతం మంది అంతర్జాతీయ వ్యవహారాల్లో మోదీ పనితీరుపై అవిశ్వాసం వ్యక్తంచేశారు. 37 శాతం మంది మాత్రం మోదీని మెచ్చుకున్నారు. ముఖ్యంగా మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాల్లో మోదీకి ప్రజాదరణ తక్కువగా ఉంది. ఇక్కడి ప్రజల్లో సగం కంటే ఎక్కువ మంది మోదీ విదేశాంగ విధానాలను నమ్మబోమని చెప్పారు. ఇదే సమయంలో అమెరికాలోని 37 శాతం మంది కూడా మోదీని నమ్మబోమని చెప్పారు. ఇక్కడ 21 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు.
 
అమెరికాలో అలా.. జపాన్‌లో ఇలా
అమెరికాలో 42 శాతం మందికి మోదీ గురించి తెలియదు, లేదా సర్వేలో పాల్గొనడానికి వారు విముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో జపాన్, కెన్యా, నైజీరియాల్లో మోదీకి మంచి ప్రజాదరణ ఉంది. మోదీ నైపుణ్యాల విషయంలో కెన్యా ప్రజలు చాలా సానుకూల ధోరణితో ఉన్నారు. ఇక్కడ 60 శాతం మంది మోదీ సామర్థ్యం, నిర్ణయం తీసుకునే శక్తిని మెచ్చుకున్నారు. మోదీ సరైన నిర్ణయాలు తీసుకుంటారని జపాన్‌లో 45 శాతం మంది నమ్ముతున్నారు. మరో 37 శాతం మంది మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇక ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ విషయానికి వస్తే, మోదీపై 41 శాతం మంది విశ్వాసం వ్యక్తంచేశారు. 42 శాతం మంది సానుకూలంగా స్పందించలేదు. ఇండోనేసియా, దక్షిణ కొరియాలలోనూ ప్రధాని మోదీకి మంచి ప్రజాదరణ ఉంది.
 
బీజేపీ మౌనం ఎందుకు?
సర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన పార్టీ బీజేపీకి సానుకూల ఫలితాలే వచ్చాయి. అయినప్పటికీ, బీజేపీ నాయకులు ఈ సర్వే గురించి పెద్దగా స్పందించలేదు. బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ దీని గురించి ఎలాంటి ప్రకటనలూ రాలేదు. అసలెందుకు దీనిపై ఎవరూ స్పందించలేదో కనుక్కునేందుకు మేం బీజేపీ అధికార ప్రతినిధి అమితాబ్ సిన్హాతో మాట్లాడాం. ‘‘మోదీకి దేశంలోనే కాదు. విదేశాల్లోనూ ప్రజాదరణ ఉంది. ఆయనతో పోటీపడే నాయకుడే లేరు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటుచేశాయి. కానీ, వారి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. వారికి మోదీ లాంటి నాయకుడే లేరు’’ అని ఆయన అన్నారు.
 
‘‘ఇక్కడ మోదీతో పోటీపడే నాయకుడే లేనప్పుడు, ఆయన ప్రజాదరణ తగ్గుతుందనే వాదనే లేదు. మోదీ ముందు ప్రస్తుత విపక్ష నాయకులంతా దిగదుడుపే. ఇక సర్వే విషయానికి వస్తే, ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు చాలా వస్తాయి. అయితే, ఆ సర్వే వెనకున్న సంస్థలు లేదా వ్యక్తుల గురించి కూడా మనం ఆలోచించాలి. ఏదేమైనా మోదీకి ప్రజాదరణ తగ్గడమనేదే లేదు. కాబట్టి ఇప్పుడు ఒక సర్వేను తీసుకొచ్చి ఆయనకు ఇంత ప్రజాదరణ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ ప్రజలకు సేవ చేయడానికి ఉంది. మేం దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తాం’’ అని ఆయన చెప్పారు.
 
రాహుల్ గాంధీ మాటేమిటి?
ప్యూ రీసర్చ్ సెంటర్ సర్వేలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ గురించి కూడా ప్రస్తావించారు. భారత్‌లో మోదీ తర్వాత రెండో ప్రాధాన్యం రాహుల్ గాంధీకి ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. భారత్‌లోని ప్రతి పది మందిలో ఆరుగురు రాహుల్ గాంధీపై సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విషయంలో ఇది 46 శాతంగా ఉంది.
 
సర్వేలో ఇంకా ఏం చెప్పారు?
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పాత్రపై సర్వేలో చాలా ప్రశ్నలు అడిగారు. ప్రపంచ వ్యవహారాల్లో భారత్ పాత్ర పెరుగుతోందని 68 శాతం మంది భావిస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో భారత్ ప్రాబల్యం బాగా పెరిగిందని ప్రతి పది మందిలో ఏడుగురు భావిస్తున్నారు. భారత్‌పై విదేశీయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్‌లో భారత్‌కు మంచి పేరుంది. భారత్‌ను సానుకూలంగా చూస్తున్నట్లు 71 శాతం మంది ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారు. కెన్యా, నైజీరియా, బ్రిటన్‌లలోనూ ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం అయ్యాయి. ఈ దేశాల్లో ప్రతి పది మందిలో ఆరుగురు భారత్‌పై సానుకూల అభిప్రాయం వ్యక్తంచేశారు. బ్రిటన్‌లో మాత్రం 68 శాతం మంది సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అయితే, దక్షిణాఫ్రికాలో దీనికి భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఇక్కడ కేవలం 28 శాతం మంది భారత్‌పై సానుకూల దృక్పథంతో ఉన్నారు. నెదర్లాండ్స్, స్పెయిన్‌లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది.
 
మిగతా దేశాలపై ఏం అనుకుంటున్నారు?
ఈ సర్వేలో కొన్ని దేశాల గురించి భారతీయులు ఏం అనుకుంటున్నారో కూడా ప్రశ్నలు సంధించారు. ఆ దేశాల జాబితాలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాబల్యం ఇటీవల బాగా పెరిగిందని చెప్పారు. అమెరికా ప్రాబల్యం తగ్గిందని కేవలం 14 శాతం మంది భారతీయులు మాత్రమే భావిస్తున్నారు. ఇక రష్యా విషయానికి వస్తే, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆ దేశ ప్రాబల్యం కూడా పెరుగుతోందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, చైనా విషయంలో సానుకూల స్పందనలు కనిపించలేదు. ఇక్కడ దాదాపు 67 శాతం మంది భారతీయులు ప్రతికూలంగా స్పందించారు. మరోవైపు 48 శాతం మంది భారతీయులు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను అసలు నమ్మడం లేదు.
 
పదేళ్లలో పాకిస్తాన్‌పై పెరిగిన వ్యతిరేకత
ప్రతి పది మంది భారతీయుల్లో ఏడురుగు పాకిస్తాన్‌పై సానుకూల దృక్పథంతో లేరు. కేవలం 19 శాతం మంది మాత్రమే ఇక్కడ సానుకూలంగా స్పందించారు. ఇక్కడ అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిల్లో కాస్త తక్కువ వ్యతిరేకత కనిపించింది. పాకిస్తాన్‌ను వ్యతిరేకించే వారిలో ఎక్కువ మంది ఎన్‌డీఏకే ఓటు వేస్తున్నారు. 2013తో పోలిస్తే, గత పదేళ్లలో పాక్‌పై వ్యతిరేకత చాలా పెరిగింది.
 
సర్వే ఎలా నిర్వహించారు?
ప్రస్తుతం భారత్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల గురించి ఉత్తర అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆసియా-పసిఫిక్, సబ్-సహరన్ ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 23 దేశాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తాజా అధ్యయనం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఏం అనుకుంటున్నారు? అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ప్రభావం ఎంతవరకూ ఉంది? లాంటి ప్రశ్నలను ఈ సర్వేలో అడిగారు. ఈ సర్వే కోసం భారత్‌లో 2,611 మంది అభిప్రాయాలను మార్చి 25, మే 11 మధ్య నేరుగా సేకరించారు. అమెరికాలో 3,576 మంది అభిప్రాయాలను మార్చి 20, మార్చి 26 మధ్య నేరుగా తీసుకున్నారు. 11 దేశాల్లో అభిప్రాయాలను ఫోన్‌లో తీసుకున్నారు. మరో పది దేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం సేకరించారు.