శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 28 ఆగస్టు 2023 (13:40 IST)

ఒక్కరు చాలు.. పిల్లలను కనడంలో భారత్‌లోనూ ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోందా?

baby boy
ఒకే బిడ్డను కనాలనే ట్రెండ్ అమెరికా, యూరోపియన్ దేశాల దంపతులలో పెరుగుతోంది. ఇప్పుడదే ట్రెండ్ భారత్‌లోనూ నడుస్తోందా? మీకు ఎంత మంది అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అని అడిగితే, ఇద్దరు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఉన్నారనో, లేదంటే మేము ముగ్గురమనో, లేక నలుగురు తోబుట్టువులనో సమాధానం వినిపిస్తుంది ఇండియాలో. నేను ఒక్కడినే అనే సమాధానం వినిపించడం చాలా అరుదు. కానీ, నేను ఒక్కడినే అనే సమాధానం రావడం అమెరికా, యూరప్ దేశాల్లో చాలా సాధారణమైన విషయం.
 
ప్రస్తుతం అమెరికా, యూరప్ సహా చాలా దేశాల్లో 'ఒక్క బిడ్డ చాలు' అనే విధానం కనిపిస్తోంది. ఆయా దేశాల్లో చాలా మంది దంపతులు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. కెనడాలోని ఒంటారియోకి చెందిన 31 ఏళ్ల జేన్ డాల్టన్ నలుగురు పిల్లల్ని కనాలనుకున్నారు. అందుకోసం సిద్ధమయ్యారు కూడా. కానీ, 2018లో వారికి పాప పుట్టిన తర్వాత జేన్, ఆమె భర్త 'ఒక్క బిడ్డ చాలు' అనే పాలసీకి వచ్చేశారు. అలా నిర్ణయం మార్చుకున్న వారు జేన్ డాల్టన్ ఒక్కరే కాదు. పిల్లలను కనే విషయంలో ఎంతోమంది తమ నిర్ణయాలను మార్చుకున్నారు.
 
యూరప్‌‌లో కేవలం ఒక్క బిడ్డ మాత్రమే ఉన్న కుటుంబాలు 49 శాతం. అలాగే, కెనడాలో 2001లో 37 శాతం ఉన్న కుటుంబాల సంఖ్య 2021 నాటికి 45 శాతానికి పెరిగింది. 1976లో ఒక్క బిడ్డ మాత్రమే ఉన్న అమెరికన్ మహిళల సంఖ్య కేవలం 10 శాతం మాత్రమే, అది 2015 నాటికి 18 శాతానికి పెరిగింది. లారెన్ సాండ్లర్ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆమెకు ఒక బిడ్డ. అయితే, ఆమె తన కెరీర్‌ను కూడా ఇష్టపడ్డారు. అందువల్ల ఒక బిడ్డ ఉండడమే ఉత్తమ మార్గమని ఆమె భావించారు. ఆమె 'ఒన్ అండ్ ఓన్లీ: ది ఫ్రీడమ్ ఆఫ్ హ్యావింగ్ యాన్ ఓన్లీ చైల్డ్ అండ్ ది జాయ్ ఆఫ్ బీయింగ్ వన్' పుస్తక రచయిత కూడా.
 
అమెరికాలో ఇద్దరు బిడ్డలను పెంచేందుకు అయ్యే సగటు ఖర్చు 3 లక్షల డాలర్లు (సుమారు 2 కోట్ల 47 లక్షల రూపాయలు). అది కూడా కాలేజీ ట్యూషన్ ఫీజులు కాకుండా. ఇక యూకేలో ఒక బిడ్డను పెంచేందుకు అయ్యే ఖర్చు 2 లక్షల డాలర్లు(సుమారు కోటి 65 లక్షల రూపాయలు). అదే ఆస్ట్రేలియాలో అయితే 1.07 లక్షల డాలర్లు(సుమారు 88 లక్షల రూపాయలు). ఒక్కరికి మించి పిల్లల్ని వద్దనుకునేందుకు వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయి.
 
బిడ్డలను కన్న తర్వాత మహిళల సంపాదనలోనూ తేడాలు కనిపించాయి. మహిళల జీతాలు యూరప్‌లో 3.6 శాతం తగ్గాయి. అమెరికాలో అది దాదాపు 13 శాతంగా ఉంది. ఒక బిడ్డ ఉంటే ఉత్తమ భాగస్వామి అవుతామని ఇంగ్లండ్‌కి చెందిన 33 ఏళ్ల లారా బెన్నెత్ అన్నారు. స్నేహితులతో బయటకు తీసుకెళ్లేందుకు తమ భాగస్వాములు అందుబాటులో లేనప్పుడు అయినా సౌకర్యంగా ఉంటుందని ఆమె చెప్పారు. ఒక బిడ్డ పుట్టిన సంవత్సరం వరకూ సంతోషంగా ఉన్నామని, రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఆ సంతోషం తగ్గిందని, మూడో బిడ్డ తర్వాత అసలు సంతోషమే లేకుండా పోయిందని తల్లిదండ్రులు చెప్పినట్లు ఒక సర్వే తెలిపింది. దాదాపు 86 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. అయితే, భారత్‌లోనూ అదే ట్రెండ్ ఉందా? ఇక్కడి తల్లిదండ్రులు ఏమంటున్నారు?
 
భారత్‌లో పరిస్థితేంటి?
దేశ రాజధాని దిల్లీకి సమీపంలోని నోయిడాలో సబీనా ఖాన్(పేరు మార్చాం) జీవిస్తున్నారు. ఆమె ఒక మీడియా కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమెకు ఒక్కరే బిడ్డ. అది ఆమె సొంత నిర్ణయం కూడా. ''ఒక్క బిడ్డ చాలనేది ప్రస్తుత పరిస్థితులకు అనువైన విధానం'' అని ఆమె బీబీసీతో చెప్పారు. అయితే, ఈ నిర్ణయం భర్త, కుటుంబ సభ్యుల సమ్మతిపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. ''మేం మా బిడ్డకు మంచి విద్య, మరింత కేర్, మంచి పెంపకం అందించాలని అనుకుంటున్నాం'' అని సబీనా చెప్పారు.
 
ఈ విషయంలో కుటుంబ సభ్యులు, ఆమెకు, ఆమె భర్తకు మద్దతుగా నిలిచారు. అయితే, బంధువులు మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కానీ, ఏ నిర్ణయంలోనైనా మీరు, మీ భర్త ఒకే మాటపై ఉంటే బయటి ప్రపంచం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సబీనా చెబుతున్నారు. కొన్నిసార్లు మరో బిడ్డ గురించి ఆలోచన వస్తుందని ఆమె అంగీకరించినప్పటికీ, తన నిర్ణయంపైనే స్థిరంగా ఉన్నారు. పిల్లల గురించి ఆమె చాలా గట్టిగా వాదిస్తున్నారు కూడా. ''ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి. ఇది వ్యక్తిగత విషయం అయినప్పటికీ, ఇప్పటి తరానికి ఇదే సరైనది. ఒకవైపు రోజువారీ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, బిడ్డను పోషించాల్సి ఉంటుంది'' అని ఆమె అన్నారు.
 
ఇప్పుడిదే ట్రెండా?
భారత్‌లో ఒక్క బిడ్డ చాలని అనుకుంటున్నారని తాను భావించడం లేదని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అమృతా నంది అన్నారు. ఆమె ''మదర్‌హుడ్ అండ్ చాయిస్: అన్‌కామన్ మదర్స్, చైల్డ్ ఫ్రీ ఉమెన్'' అనే పుస్తకం రాశారు. ''ఒక్క బిడ్డ కావాలనుకుంటున్న వారు ఉన్నారు. అయితే, అలాంటి వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఉన్నత వర్గాలు, బాగా చదువుకున్నోళ్లు అందులో ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారి సంఖ్య బలంగా ఉన్న నమ్మకాలను, ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న విధానాలను ప్రభావితం చేయలేదు'' అని ఆమె చెప్పారు.
 
''ఇతర ఆసియన్లలా కాకుండా, ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండడం వారి శ్రేయస్సుకు మంచిదిగా భారతీయులు భావిస్తారు. తండ్రులు, తోబుట్టువులను తమ భావోద్వేగాలను అర్థం చేసుకునే వారిలా, ఆర్థిక భద్రతకు అండగానూ భావిస్తారు'' అని డాక్టర్ నంది వివరించారు. ఆమెకు కూడా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నారు. ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయడమే భారత్‌లో కష్టంగా ఉంటే, ఇక ఒక బిడ్డ మాత్రమే చాలనే విధానం భారతీయుల్లో ఆగ్రహానికి కూడా కారణమవ్వొచ్చని ఆమె అన్నారు.
 
భారత్‌లో గణాంకాలు ఏం చెబుతున్నాయి?
''నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్) 2019-2021 లెక్కల ప్రకారం, 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ మహిళలు, పురుషుల్లో ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారనే సగటు 2.1గా ఉంది. ఇద్దరు పిల్లలు కావాలని దేశ ప్రజలు కోరకుంటున్నారని అది స్పష్టం చేస్తోంది'' అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా చెప్పారు. ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్-5 డేటా ప్రకారం, కొత్తగా పెళ్లైన వారు కూడా ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కావాలనుకుంటున్నారని, కానీ 35 ఏళ్లు నిండి, ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు రెండో బిడ్డను వద్దనుకుంటున్నారని పూనమ్ తెలిపారు.
 
సంపన్న వర్గాల్లో చాలా మందికి ఒక్క బిడ్డ మాత్రమే ఉంటున్నారని, కానీ అదే ట్రెండ్ అని చెప్పలేమని ఆమె చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ ఇండియాలో కూడా పెరగొచ్చని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్‌ భారత్‌లోనూ కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ ఒక్క బిడ్డ చాలు అనే విధానాన్ని తాను సమర్థించనని డాక్టర్ పూనమ్ తెలిపారు. చైనా, జపాన్‌‌తో పోలుస్తూ, అక్కడ పనిచేసేందుకు కూడా జనం తక్కువగా ఉన్నారని, వయసు పైబడిన వారిని చూసుకునేందుకు కూడా ఎవరూ ఉండడం లేదని ఆమె అన్నారు. భారత్‌లో మరో పెద్ద సవాల్ ఎదురవుతుంది. ఒకవేళ ఎక్కువ మంది ఒక్క బిడ్డ చాలని అనుకుంటే కొన్నేళ్లకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుంది. బాబాయి - పిన్ని, మావయ్య - అత్తయ్య లాంటి బంధాలు కనిపించవు.