మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (15:22 IST)

దిల్లీలో చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎంపీ కేశినేని నాని అసహనం

kesineni nani
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన సందర్భంగా ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు దిల్లీకి చేరుకున్న సందర్భంగా ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఆ సమయంలో పార్టీ అధినేతకు బొకే అందించాలని కేశినేని నానిని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆహ్వానించారు. కానీ దానిని కేసినేని నాని అసహనంగా తిరస్కరించారు. ‘మీరే ఇవ్వండి’ అన్నట్లుగా ఆయన చేతులతో సైగ చేసి, దూరంగానే నిలబడి ఫొటోలు దిగారు.

 
కాగా, పార్టీ అధినేతపై కేశినేని నాని అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం హైదరాబాద్ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి దిల్లీ నుంచి మళ్లీ హైదరాబాద్‌కి చేరుకుంటారు. చంద్రబాబు దిల్లీ పర్యటనలో కేశినేని నాని వ్యవహారశైలిపై రాజకీయంగా చర్చ సాగుతోంది.

 
కొంతకాలంగా టీడీపీ నాయకత్వం పట్ల నాని అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె వివాహ వేడుకలో చంద్రబాబు, నారా లోకేష్ వంటి వారితో ఆయన సన్నిహితంగా మెలిగారు. దాంతో అంతా సర్దుమణుగుతుందని టీడీపీ శ్రేణులు భావించాయి. విజయవాడ కేంద్రంగా ఇటీవల కేశినేని నాని సోదరుడు చిన్ని కొంత దూకుడుగా కనిపిస్తున్నారు. రాజకీయంగా క్రియాశీలంగా మారే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

 
దాంతో నాని స్థానంలో చిన్నికి టీడీపీలో కొందరు సహకరిస్తున్నారనే కథనాలు వచ్చాయి. విజయవాడ నగర టీడీపీలో నాయకులుగా ఉన్న బోండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులతో కేశినేని నానికి విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి అధిష్టానం ఆశీస్సులు అందుతున్నాయనే అభిప్రాయం గతంలో నాని వ్యక్త పరిచారు. ఇతర కారణాలు కూడా కలిసి రావడంతో టీడీపీకి విజయవాడ ఎంపి దూరం అవుతారన్న ఊహాగానాలు వినిపించాయి. తాజాగా అధినేత పట్ల ఆయన స్పందించిన తీరు అలాంటి అంచనాలకు ఊతమిచ్చేలా కనిపిస్తోంది.