గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 28 మార్చి 2024 (15:26 IST)

టైటానిక్ సినిమాలో రోజ్‌ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు

Titanic movie
టైటానిక్ సినిమాలో నీళ్లపై తేలుతూ హీరోయిన్ రోజ్ ప్రాణాలను కాపాడిన చెక్క ముక్క ధర వేలంలో దాదాపు రూ. 6 కోట్లు పలికింది. సినిమాలో ఉపయోగించిన ఈ చెక్క(డోర్)ను వేలం వేయగా అక్షరాలా రూ. 5.99 కోట్ల (7,18,750 డాలర్లు)కు అమ్ముడైంది. 1997లో టైటానిక్ సినిమా విడుదలైనప్పటి నుంచి, ఆ చెక్క డోర్ రోజ్ ప్రియుడు జాక్‌ కూడా పట్టేంత పెద్దదిగా లేదా, ఉంటే జాక్ కూడా ప్రాణాలతో బయటపడేవాడు కదా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ప్రాపర్టీ గురించి అభిమానుల్లో పెద్ద చర్చ జరిగిందని వేలం నిర్వాహకులు పేర్కొన్నారు.
 
ప్లానెట్ హాలీవుడ్ రెస్టారెంట్, రిసార్ట్ గ్రూపు యాజమాన్యంలోని ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ వేలం సందర్భంగా ఈ చెక్కను కూడా అమ్మకానికి పెట్టారు. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన టైటానిక్ సినిమాలో జాక్ పాత్ర పోషించిన లియోనార్డో డికాప్రియో, తలుపు (డోర్) భాగమైన ఆ చెక్క ముక్క కేవలం తన ప్రియురాలు రోజ్‌ (కేట్ విన్స్‌లెట్)కు మాత్రమే సరిపోయేంత పెద్దదిగా ఉందని చెప్పారు. రోజ్‌ను ఆ చెక్కపైకి పంపించి ప్రాణాలు కాపాడిన జాక్ పాత్ర, ఆ తర్వాత అట్లాంటిక్ సముద్రంలో గడ్డకట్టే చల్లటి నీటిలో మునిగిపోతుంది. అతని మృతదేహం, సముద్రంలో పడిపోతుంది.
 
2012లో మిత్‌బస్టర్స్‌కు చెందిన ఒక ఎపిసోడ్‌లో టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఈ సన్నివేశానికి సంబంధించి రోజుకు తనకు డజన్ల కొద్ది ఈమెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. వాటిలో ఈ సన్నివేశం గురించి వివరిస్తూ రోజ్‌ను స్వార్థపరురాలు అని, జాక్‌ను మూర్ఖుడు అంటూ అభివర్ణించేవారని కామెరూన్ చెప్పారు. అయితే, స్క్రిప్టు ప్రకారం సినిమాలో జాక్ చనిపోవాల్చిందేనని చెబుతూ ఆయన ఈ చర్చకు ముగింపు పలికారు.
 
‘‘మేం కాస్త చిన్న చెక్కను వాడాల్సింది’’ అని ఆయన అన్నారు. ఆ ప్రాపర్టీని ఒక తలుపు అని తరచుగా పొరబడుతుంటారని వేలం నిర్వాహకులు హెరిటేజ్ యాక్షన్స్ తెలిపింది. ఆ చెక్క ఇద్దరు పట్టేంత పెద్దదిగా ఉంటుందా? అనే చర్చకు సమాధానమిస్తూ కంపెనీ ఇలా పేర్కొంది. ‘‘ఆ ప్రాపర్టీ కొలత దాదాపుగా 2.4 మీ పొడవు, 1 మీ వెడల్పు ఉంటుంది’’ అని వెల్లడించింది. ఈ వేలంలోకి వచ్చిన ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్ సినిమాలో వాడిన కొరడాకు రూ. 4.3 కోట్ల ధర పలికింది.
 
టోబీ ధరించిన స్పైడర్‌ మ్యాన్ సూటు రూ. 1.04కోట్లు రాగా, ద షైనింగ్ సినిమాలో జాక్ నిఖోల్సన్ వాడిన గొడ్డలికి కూడా ఇదే ధర వచ్చింది. ఆదివారం సాయంత్రం ముగిసిన ఈ వేలంలో మొత్తం రూ. 125 కోట్లు (15.68 మిలియన్ డాలర్లు)కు పైగా వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇది అత్యంత విజయవంతమైన వేలాల్లో ఒకటని హెరిటేజ్ యాక్షన్స్ వ్యాఖ్యానించింది.