శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 7 జనవరి 2021 (12:09 IST)

అమెరికా పార్లమెంట్ ముట్టడి: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జనవరి 21 వరకూ ఎమర్జెన్సీ

అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనంలోకి డోనల్డ్ ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో దూసుకెళ్లారు. ట్రంప్ అనుకూల నినాదాలు చేస్తూ, జెండాలు ఊపుతూ.. పోలీసు రక్షణ వలయాన్ని కూడా చేధించుకుని ముందుకెళ్లారు. క్యాపిటల్ భవనాన్ని ముట్టడించి, గదుల్లో తిరిగారు. గందరగోళం సృష్టించారు. ఈ హింసాత్మక అల్లర్లలో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 52 మందిని అరెస్ట్ చేసారు. వారిలో 47మంది కర్ఫ్యూ అమలును ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. అల్లర్లలో చనిపోయిన మహిళను అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యాష్లీ బాబిట్‌గా గుర్తించారు. శాన్ డియాగోలో నివసించే బాబిట్ ట్రంప్‌కు మద్దతు తెలిపేవారని ఆమె బంధువులు తెలిపారు.

 
ప్రస్తుతం అమెరికా పార్లమెంట్‌లో ఏం జరుగుతోంది?
ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను చట్టసభ సభ్యులు ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బైడెన్ 306 ఓట్లు గెలుచుకోగా, ట్రంప్ 232 గెలుచుకున్నారు. రాష్ట్రాలవారీగా ఎవరు ఎన్ని ఓట్లు గెలుచుకున్నారన్నది ప్రకటిస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిపై రెండు గంటలపాటూ చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఇంతకుముందే అరిజోనా ఎన్నికల ఫలితాలపై లేవనెత్తిన అభ్యంతరాలు వీగిపోయాయి.

 
అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు నగర మేయర్ మురియెల్ బౌజర్ ప్రకటించారు. మరో 15 రోజులవరకూ అంటే పదవీ స్వీకారం జరిగే మర్నాటివరకూ ఎమర్జెన్సీ కొనసాగించాలని తెలిపారు. నగరవాసులకు కావలసిన భద్రతా ఏర్పాట్ల దిశగా అదనపు బలగాలను మోహరించేందుకు ఈ ప్రకటన తోడ్పడుతుంది. ఇప్పటికే నగరంలో కర్ఫ్యూ అమలు చేసారు. అవసరమైతే అత్యవసర సేవలను విస్తరిస్తారని, నిత్యావసరాలు పంపిణీ చేస్తారని తెలిపారు. జనవరి 21 మధ్యహ్నం 3.00 గంటలవరకూ ఎమర్జెన్సీ కొనసాగుతుందని తెలిపారు.

 
అమెరికా పార్లమెంటు ముట్టడిపై స్పందించిన మోదీ
"వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అల్లర్లు, హింస బాధాకరం. అధికార బదిలీ చట్టబద్ధంగా, శాంతియుతంగా జరగాలి. చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడాన్ని సమ్మతించలేం" అని మోదీ తెలిపారు. "యూఎస్‌లో విచారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామానికి పెద్ద పీట వేసే అమెరికా లాంటి దేశంలో అధికార బదిలీ చట్టబద్ధంగా, శాంతియుతంగా జరగడం చాలా ముఖ్యం" అని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేసారు.
 
‘అమెరికా పార్లమెంట్ చరిత్రలో ఇది చీకటి రోజు’
జరిగిన సంఘటనలపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పందిస్తూ... అమెరికా పార్లమెంట్ చరిత్రలో ఇది చీకటి రోజు అంటూ విచారం వ్యక్తం చేసారు. "హింస ఎప్పుడూ విజయం సాధించలేదు. స్వేచ్ఛ మాత్రమే గెలుపు సాధిస్తుంది" అని ఆయన అన్నారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం దేశాధ్యక్షుడు తన విధులను సరిగ్గా నిర్వహించలేకపోయినట్లైతే, అధికారాలను మరొకరికి అప్పగించవచ్చు.

 
ఈ సందర్భంలో.. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడంలో విఫలం అవుతున్నారని, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ యాక్టింగ్-ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుపుతూ మైక్ పెన్స్‌తో సహా మెజారిటీ క్యాబినెట్ నాయకులు ఉమ్మడిగా కాంగ్రెస్ లీడర్స్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే, 1967లో ఈ సవరణ ఆమోదముద్ర పొందిన దగ్గరనుంచీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అమలు చెయ్యలేదు. అమెరికా పార్లమెంట్‌పై దాడి నేపథ్యంలో.. ట్రంప్ హింసను ప్రేరేపిస్తున్నారని, 25వ సవరణను అమలులోకి తేవల్సిందిగా పలువురు పెన్స్‌ను కోరుతున్నారు.

 
వైట్ హౌస్ డిప్యుటీ సెక్రటరీ రాజీనామా
వైట్ హౌస్ డిప్యుటీ సెక్రటరీ సారా మాథ్యూస్ తన పదవికి రాజీనామా చేసారు. "ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు, మేము అమలు చేసిన పాలసీ విధానాల విషయంలో గర్విస్తున్నాను. కానీ ఈరోజు జరిగిన దాడి నన్ను చాలా బాధించింది. అధికార బదిలీ శాంతియుతంగా జరగాలి" అని ఆమె అన్నారు.

 
‘ఈ హింస దేశానికే సిగ్గుచేటు’ - బరాక్ ఒబామా
అమెరికా పార్లెమెంట్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ప్రకటన విడుదల చేసారు."ఇవాళ పార్లమెంట్‌పై జరిగిన దాడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. చట్టబద్ధంగా జరిగిన ఎన్నికలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రస్తుత అధ్యక్షుడు ప్రేరేపించిన ఈ హింస మన దేశానికే సిగ్గుచేటు" అని మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

 
"ఎన్నికల ఫలితాల వలన కలత చెందిన ఓటర్లకు నిజం చెప్పడం ద్వారానే గౌరవం ఇవ్వాలి. నిజం ఏమిటంటే...ట్రంప్ ఓడిపోయారు. బైడెన్ గెలిచారు. ఇదేమీ ఆట కాదు. నిజాన్ని ఒప్పుకుని తీరాల్సిందే" అని 2012 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నే తెలిపారు.

 
సౌత్ కాలిఫోర్నియా సెనేటర్, ట్రంప్ విధేయుడు లిండ్సే గ్రాహం మట్లాడుతూ..."ఈ ఘర్షణలకు నేను మద్దతు తెలుపలేను. ఇప్పటివరకూ జరిగింది చాలు. జో బైడెన్, కమలా హారిస్ చట్టబద్ధంగా ఎన్నికల్లో గెలుపొందారు. జనవరి 20న వారిద్దరూ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు" అని అన్నారు. ఇలినాయిస్ సెనేటర్ టామీ డక్వర్త్ మాట్లాడుతూ...ట్రంప్‌ను రక్షించే దిశలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం ఎంతవరకూ సబబో ఆలోచించాలని తన సహోద్యోగులను కోరారు.

 
వీగిన రిపబ్లికన్ల అభ్యంతరాలు
అరిజోనా ఎన్నికల ఫలితాల పట్ల టెడ్ క్రూజ్ తదితరులు లేవనెత్తిన అభ్యంతరాలు వీగిపోయాయి.కేవల ఆరుగురు రిపబ్లికన్లు మాత్రమే వీరు లేవనెత్తిన అభ్యంతరాలకు అనుకూలంగా ఓటు వెయ్యడంతో అవి వీగిపోయాయని ఉపాధ్యక్షుడు పెన్స్ తెలిపారు.

 
కాంగ్రెస్ ఉభయ సభలు తాత్కాలికంగా వాయిదా
ఈ అల్లకల్లోలం నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఖరారు చేసేందుకు ఈ సమావేశాలు మొదలయ్యాయి. ట్రంప్ మద్దతుదారుల 'తిరుగుబాటు' ఉద్యమాన్ని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ తీవ్రంగా తప్పుపట్టారు. డోనల్డ్ ట్రంప్ కూడా ఈ హింసను ఖండించాలని జో బిడెన్ కోరారు.

 
అయితే, అమెరికా పార్లమెంటువైపు నడుచుకుంటూ వెళ్లాలని తొలుత ప్రదర్శనకారులకు పిలుపు ఇచ్చిన డోనల్డ్ ట్రంప్ తర్వాత వారిని ఇంటికి వెళ్లాలని కోరారు. తూర్పు ప్రవేశ ద్వారం వైపు నుంచి ఆందోళన కారులు క్యాపిటల్ భవనంలోకి చొరబడ్డారు. పార్లమెంటు భవనంలోకి ఆందోళనకారులు రావడంతో కాంగ్రెస్ సభ్యులు బల్లల కింద దాక్కున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యలు కొందరు గ్యాస్ మాస్కులు ధరించారు.

 
ఈ గందరగోళంలో పార్లమెంటు భవనంలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందారని మెట్రోపాలిటన్ పోలీసు డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు. రెండు అనుమానాస్పద పేలుడు పదార్థాలు కూడా గుర్తించామని, వాటిని ఎఫ్‌బీఐ, క్యాపిటల్ హిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణల నేపథ్యంలో నగరంలో లాక్‌డౌన్ విధించారు.