బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (09:05 IST)

విత్తమంత్రి అరుణ్ జైట్లీ చిట్టా పద్దులు... నేడు పార్లమెంట్‌కు సమర్పణ

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 వార్షిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు.. స్వదేశీయంగా ఎదురవుతున్న అనేక రకాల అనివార్యతలు,  ఒత్తిళ్లు, రాజకీయ లక్ష్యాలను కలగలిపి ఈ బడ్జెట్‌ను ఆయన రూపొందించినట్టు ఉన్నారు. 
 
ముఖ్యంగా గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్‌ పతనంతో ఆందోళనలో ఉన్న పెట్టుబడిదారులను మెప్పిస్తూనే... వరుగా మరో ఏడాదీ వానలు మొహం చాటేయడంతో దిగాలు పడిన రైతాంగాన్ని తృప్తిపరిచేలా ఎలాంటి ప్రతిపాదనలను ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, అన్ని వర్గాలను ఒప్పించడం కత్తిమీదసామే. ఆదాయపు పన్ను విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న స్లాబులనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించేలా జైట్లీ ప్రతిపాదించవచ్చని వినికిడి. పన్ను మినహాయింపుల వరకు స్వల్పంగా మార్పులుచేసే అవకాశముంది. 
 
ఇక పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా దేశాన్ని మలచడంలో భాగంగా పన్నుల్లో అవాంఛిత విచక్షణను తొలగించేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించనున్నారు. అదేసమయంలో సత్వరం సంస్కరణలు అమలు కావాలని కోరుకుంటున్న విదేశీ పెట్టుబడిదారుల మనసుల్నీ ఆయన నెగ్గాల్సి ఉంది. వీరు గత యేడాది కాలంలో 2.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,080 కోట్లు) విలువైన షేర్లను విక్రయించేశారు. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతభత్యాలు చెల్లించడానికి అవసరమయ్యే రూ.1.02 లక్షల కోట్లు కారణంగా ఆర్థిక మంత్రి కష్టాలు రెట్టింపుకానున్నాయి. దీని ద్వారా ఖజానాకు ఏర్పడే లోటును ఆయన భర్తీ చేయాల్సి వుంది. 
 
అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో విత్తలోటును స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంలో రాజీపడకుండా నిధుల్ని ఏ రకంగా సర్దుబాటు చేసుకువస్తారనేది తేలాల్సి ఉంది. నాలుగేళ్లలో కార్పొరేట్‌ పన్నును 30% నుంచి 25 శాతానికి తగ్గిస్తామని జైట్లీ గత ఏడాది హామీ ఇచ్చారు. ఆ కసరత్తును ఈ బడ్జెట్‌ నుంచే ప్రారంభించవచ్చు. తర్వాతి దశలో పన్ను మినహాయింపుల్ని ఎత్తివేసేకసరత్తు చేస్తారని సమాచారం. పెరుగుతున్న ఖర్చుల్ని తట్టుకునేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పరోక్ష పన్నుల్ని పెంచడమో, కొత్త పన్నుల్ని విధించడమో తప్పేలా లేదు. 
 
స్వచ్ఛభారత్‌ సెస్సును గత యేడాది నుంచి విధిస్తున్నారు. అదేరీతిలో అంకుర భారత్‌ (స్టార్టప్‌ ఇండియా), డిజిటల్‌ భారత్‌ వంటి ఇతర కార్యక్రమాల కోసం కొత్తగా కొంత సెస్సులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల చక్రాన్ని పునరుద్ధరించడంపైనా ఆర్థిక మంత్రి దృష్టి కేంద్రీకరించనున్నారు. మౌలిక సదుపాయాల రంగంలో నిధులు ప్రవహించేలా చేయడంతో పాటు, ప్రైవేటు పెట్టుబడులు ఆశించినంతగా ఊపందుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థల వ్యయాన్ని పెంచేలా చూసే వాతావరణం కనిపిస్తోంది. 
 
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు వ్యవసాయ రంగ సంక్షోభం, పంటలకు తగిన ధరలు లభించకపోవడం వంటి పరిస్థితుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇప్పటి మాదిరిగానే నిధులు కేటాయించవచ్చు. పంటల బీమా పథకానికి, సేద్యపు నీటి పనులకు నిధుల్ని పెంచే అవకాశం ఉంది. ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న తోలు పరిశ్రమలు, ఆభరణాల తయారీ వంటి రంగాలకు పన్ను ప్రయోజనాలు కల్పించే సూచనలున్నాయి. బంగారం దిగుమతులు గత ఏడాది కాలంలో పెరగడం, ఫారెక్స్‌ నిల్వలపై అది ప్రభావం చూపడంతో పుత్తడిపై దిగుమతి సుంకాన్ని పెంచవచ్చు. మొత్తం అన్ని రంగాలను మెప్పిస్తూ.. జనరంజకమైన బడ్జెట్‌ను అరుణ్ జైట్లీ వెల్లడించే అవకాశం ఉంది.