శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (15:55 IST)

రైల్వే బడ్జెట్ 2016-17 : మంత్రి సురేష్ ప్రభు ఎక్స్‌ప్రెస్ ఏపీ స్టేషన్‌లో ఆగేనా?

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2016-17 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టనున్నారు. అయితే, సురేష్ ప్రభు రైలు ఈ దఫా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఆగుతుందా లేక ఎప్పటిలా జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతుందా అనే మీమాంస నెలకొంది. నిజానికి విభాజిత రాష్ట్రానికి మరిన్ని రైల్వే ప్రాజెక్టులు కేటాయించాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలాగే, పలు మార్గాల్లో కొత్త రైళ్లు నడపాని ఆశగా ఎదురు చూస్తున్నారు. 
 
ముఖ్యంగా గుంటూరు, విజయవాడ డివిజన్‌ వాసుల్లో ఈ ఆశలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది రైల్వే బడ్జెట్‌లో మొండిచేయి ఎదురైన నేపథ్యంలో డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకైనా నడిపితే బాగుంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కొత్తలైన్లలో కదలిక తెప్పించాలని కోరుతున్నారు. 
 
విజయవాడ, గుంటూరు నుంచి షిర్డీకి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బెజవాడ మీదుగా మూడు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వారానికి మూడు రోజలు, మిగిలినవి కేవలం ఒక్కరోజే నడుస్తాయి. రోజువారీ రైళ్ల కోసం చాలా యేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం కనిపించటంలేదు. అందువల్ల ఈ రెండు ప్రాంతాల నుంచి డైలీ సర్వీసులు నడపాలని కోరుతున్నారు.
 
గుంటూరు, విజయవాడల్లో ముస్లిములు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా నాగూరు దర్గా, నాగపట్టణంలోని మేరీమాతను దర్శించుకునేందుకు ఎక్కువగా వెళుతుంటారు. గూడూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. నాగూరు - నాగపట్టణానికి డైరక్ట్ రైళ్లు నడపాలని కోరుతున్నారు. 
 
ప్రస్తుతం గుంటూరు - కాజీపేట మధ్య డబుల్‌డెక్కర్‌ రైలు నడుస్తున్నా ప్రయాణికుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈ రైలును విజయవాడ నుంచి చెన్నై, విశాఖపట్నం, సికింద్రాబాదుకు నడిపాలని కోరుతున్నారు. దీనిద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతంగానూ, రైల్వేకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గుంటూరు నుంచి చెన్నై ఒకే రైలుంది. ఈ మార్గంలో మరో రైలు నడపాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. 
 
వీటితో పాటు.. నల్లపాడు-బీబీనగర్‌ మధ్య అదనపు మార్గం, పిడుగురాళ్ల, నడికుడి, మాచర్ల, నల్గొండ, మిర్యాలగూడలాంటి ప్రధాన స్టేషన్లుండే ఈ మార్గంలో రెండో ట్రాక్ నిర్మించాలని కోరుతున్నారు. నాగాయలంక సమీపంలోని గొల్లలమోద రాకెట్‌లాంచింగ్‌ కేంద్రం మంజూరైంది. దీనిని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానిస్తూ రేపల్లెమీద మార్గాన్ని నిర్మించాలని కోరుతున్నారు. మచిలీపట్నం-బాపట్ల-రేపల్లె కొత్తమార్గానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరుతున్నారు.