వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలంటే.. రోజుకు రూ.10 చాలు..
వృద్ధాప్యంలో ఆర్థికంగా చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ కోరుకునేవారికి ఇది మంచి పొదుపు పథకం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారెవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు. మీరు ఈ పథకంలో చేరిన నాటి నుంచి మీ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. మీకు 60 ఏళ్లు పూర్తైన నాటి నుంచి నెలకు పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎంత తక్కువ వయస్సులో చేరితే అంత తక్కువ పొదుపు చేయొచ్చు. మీ వయస్సు పెరిగినకొద్దీ పొదుపు చేయాల్సిన మొత్తం పెరుగుతుంది.
ఉదాహరణకు మీ వయస్సు 22 అయితే మీరు నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలంటే నెలకు ఎంత పొదుపు చేయాలో తెలుసా? కేవలం రూ.292 మాత్రమే. అంటే రోజుకు రూ.10 పొదుపు చేస్తే చాలు. నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. అదే మీ వయస్సు 18 ఏళ్లు అయితే రోజుకు రూ.7 చొప్పున నెలకు రూ.210 పొదుపు చేస్తే చాలు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ 40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరి రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే నెలకు రూ.1,454 జమ చేయాల్సి వుంటుంది.