1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (12:30 IST)

మామిడి పండ్లలో రారాజు.. 'బంగినపల్లి పండు'కు అరుదైన గుర్తింపు

పండ్లన్నింటిలో మామిడి రారాజు బంగినపల్లి. ఈ పండుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పండునే బేనీషాన్ మామిడి అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి రకాలలో ఇది ఒకటి. దాదాపు 350 సంవత్సరాల క్రితం కర్నూలు

పండ్లన్నింటిలో మామిడి రారాజు బంగినపల్లి. ఈ పండుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పండునే బేనీషాన్ మామిడి అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి రకాలలో ఇది ఒకటి. దాదాపు 350 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆవిష్కృతమైంది. నాటి నుంచి నేటి వరకు ఈ పండు మామిడి పండ్లలో రారాజుగానే వెలుగొందుతోంది. 
 
బంగినపల్లి మామిడి పండుది చూపు తిప్పుకోలేని అందం.. పసిడి వన్నెపు మెరుపు.. నోరూరించే రుచి.. మత్తెక్కించే వాసన.. తినే కొద్దీ కమ్మని అనుభూతి.. మామిడి పండ్లలోనే మహత్తరమైన పండు ఇది. అలాంటి బంగినపల్లి మామిడికి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ రకమైన మామిడి ఆంధ్రప్రదేశ్ సొంతం అంటూ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికల్ ట్యాగ్ లభించింది. ప్రపంచంలోని ప్రజలందరికీ నోరూరించిన బంగినపల్లి.. ఆంధ్రప్రదేశ్ సొంతం అని నిర్ధారిస్తూ భౌగోళిక విశిష్ట గుర్తింపు లభించింది. 
 
ఈ పండును 3 నెలలపాటు కోల్డ్‌ స్టోరేజీలో ఉంచినా వీటి రుచి ఏమాత్రం తగ్గదని రాష్ట్ర ప్రభుత్వం జీఐ దరఖాస్తులో పేర్కొంది. కర్నూలు జిల్లా బనగానపల్లె, పాణ్యం, నంద్యాల మండలాలను ఈ మామిడిపండ్లకు ప్రాథమిక మూల కేంద్రాలుగా తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రతోపాటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్‌, అదిలాబాద్‌ జిల్లాలను కూడా వీటి మూల కేంద్రాలుగా పేర్కొంది.
 
వీటి మూలాలకు సంబంధించి ‘బనగానపల్లె - స్టేట్‌ మద్రాస్‌ వార్‌ ఫండ్‌ సీల్‌’ వంటి చారిత్రక ఆధారాలను చూపింది. 2011లో అప్పటి రాష్ట్ర హార్టికల్చర్‌ కమిషనర్‌ రాణి కుముదిని సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం... 7.66 లక్షల కుటుంబాలు బనగానపల్లె మామిడిపండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 5500 టన్నులకు పైగా మామిడిపండ్లను అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు ఏటా ఎగుమతి చేస్తున్నారు. బంగినపల్లి మామిడిపండ్ల వార్షిక టర్నోవర్‌ సుమారు రూ.1,461 కోట్లు. రైతులకు మెరుగైన మార్కెట్‌ ధర లభించేందుకు జీఐ ట్యాగ్‌ ఉపకరిస్తుంది. మేథో సంపత్తి హక్కుల్లో జీఐ ట్యాగ్‌ కూడా ఒక భాగంగా పేర్కొనవచ్చు.