బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:48 IST)

ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో బాదుడే.. బాదుడు..

దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల తర్వాత దేశంలో పెట్రోల్ చార్జీలు భారీగా పెరగవచ్చనే సంకేతాలు వినొస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. పెట్రోల్ ముడి చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే బ్యారల్‌ ధరలు పైపైకి చేరుకోవటంతో బహిరంగ మార్కెట్లో కూడా ఆయిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత నిలకడగా ఉంటున్నాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పెట్రోల్‌ డీలర్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కె ట్లో పెట్రోల్‌ లీటర్‌ రూ.77.21ఉండగా, డీజిల్‌ రూ.71.72లకు విక్రయిస్తున్నారు.
 
గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. నెల రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయాయి. క్రూడ్‌ ఆయిల్‌ బ్యారల్‌ విలువ గత నెల 26న 67.38 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 75.23 వరకు పెరిగింది. 
 
దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత పెరిగిన బ్యారల్‌ ధరలతో బహిరంగ మార్కెట్లో కూడా పెట్రో ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని డీలర్స్‌ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలతో పోలిస్తే పెట్రోల్‌ లీటర్‌ రూ.85 నుంచి రూ.90లను కూడా తాకే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోసం ధరలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల ముగిసిన అనంతరం పెట్రో ధరల బాదుడు ప్రారంభిస్తారని సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.