వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్ ధరలు
దేశంలోని వాహనదారులకు కేంద్రం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే విషయంపై కేంద్రం దృష్టిసారించింది. ఈ విషయాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇంధనపై రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్ ధర సెప్టెంబరు నెలలో రూ.74 డాలర్లుగా ఉంది. మార్చి నెలలో ఈ బ్యారెల్ ధర రూ.83 నుంచి రూ.84 డాలర్లుగా ఉండేది. ఆ సమయంలోనే పెట్రోల్ ధరలను లీటరుపై రూ.2 మేరకు తగ్గించారు.
ఇపుడు అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే ముడిచమురు ధరలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖంపట్టాయి. ఫలితంగా ప్రస్తుతం ఈ బ్యారెల్ ధర 74 డాలర్లుగా ఉంది. ఈ ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో దేశీయంగా ఇంధన ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా అంచనా వేసింది. అంతర్జాతీయ ధరలతో పోల్చితే చమురు కంపెనీలు లీటరుపై రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున లాభాలను అర్జిస్తున్నాయి. కాగా, దేశంలో మార్చి నెలలో వీటి ధరలు తగ్గించిన తర్వాత ఇప్పటివరకు ధరల్లో మార్పులు చేయకపోవడం గమనార్హం.