మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (16:57 IST)

కియా మోటార్స్ కీలక ప్రకటన : మరో రూ.400 కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కియా మోటార్స్ ఉంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలు హల్చల్ చేశాయి. పైగా తన ప్లాంట్ విస్తరణను ఏపీలో నిలిపివేసి, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ సంస్థ విస్తరణ పనులు చేపట్టనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలు అలా ఉండిపోయాయి.
 
ఇపుడు కియా మోటార్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు సౌత్ కొరియాకు చెందిన ఈ కార్ల ఉత్పత్తి సంస్థ ప్రకటన చేసింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు.
 
'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్‌కు బలమైన బంధం ఉందని చెప్పారు.