శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (21:58 IST)

జగన్ సర్కారుకు మరో తలనొప్పి : చీఫ్ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో తలనొప్పి తప్పేలా లేదు. శాసనమండలి రద్దుతో పాటు... సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీని ఏపీ సర్కారు నియమించలేదు. సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. 
 
పిటిషన్ తరపున సీనియర్ లాయర్ ఉన్నం మురళీధర్ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదనలను వినిపిస్తూ శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.
 
వాదనలు విన్న అనంతరం  ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, శాసనమండలి కార్యదర్శికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదా వేసింది. 
 
కాగా, మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కానీ, ఈ బిల్లులకు శాసనమండలి బ్రేక్ వేసింది. దీనికి కారణం శాసనమండలిలో అధికార పార్టీకి మెజార్టీ లేకపోవడమే. 
 
మండలిలో టీడీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఆ రెండు బిల్లులకు బ్రేక్ వేసింది. దీంతో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి ఛైర్మన్ షరీఫ్ ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత ఏపీ సర్కారు శాసనమండలిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దుపై సెలెక్ట్ ఎందుకు ఏర్పాటు చేయలేదో వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీచేసింది.