వాణిజ్య సిలిండర్ ధరపై బాదుడు.. మార్చి ఒకటో తేదీ నుంచి అమలు!
దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోమారు పెంచాయి. ధరల సవరణ చర్యల్లో భాగంగా, మార్చి ఒకటో తేదీ శుక్రవారం చమురు కంపెనీలు ఈ పెరిగిన ధరలను వెల్లడించాయి. ఈ ప్రకారంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు దేశ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులపై పడుతుంది. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రిటైల్ ధర రూ.1795కు చేరింది.
అలాగే, ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతాలో రూ.1911, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1960.50కు చేరింది. అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపనీలు వెల్లడించాయి. మరోవైపు, విమానం ఇంధన ధరలను కూడా కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో కిలోలీటర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధర రూ.624.37కు చేరిందని చమురు కంపెనీలు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.