సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (13:40 IST)

విమానంలో విండో సీటు కావాలా... రూ.2 వేలు చెల్లించాలి...

indigo
తమ ప్రయాణికులకు ప్రైవేట్ విమాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన విమానాల్లో విండో సీటు కావాలనుకునేవారికి ఓ ఆఫర్ ప్రకటించింది. విండో సీటు కావాలంటే రూ.2 వేలు చెల్లించాలని తెలిపింది. 
 
ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ 'లెగ్ రూమ్' ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000 ఫిక్స్డ్ ఛార్జీ నిర్ణయించింది. ఇక విండో సీటు బుకింగుపై రూ.2000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. 222 సీట్లు ఉండే ఏ321 విమానం ముందు వరుసలో విండో సీటు బుకింగుపై రూ.2000, నడక దారి సీటు బుకింగుపై రూ.1500, అదేవరుసలోని రెండో, మూడో సీట్ల బుకింగుపై రూ.400 ఛార్జీలు ఉంటాయని తెలిపింది. 232 సీట్లు ఉన్న ఏ321 ఫ్లైట్, 180 సీట్లు ఉన్న ఏ320 ఫ్లైట్‌పై కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. 
 
ప్రయాణికులు ఒకవేళ ప్రాధాన్య సీటు అవసరంలేదనుకుంటే ఛార్జీలు లేని సీటును ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సమయంలో సీటును కేటాయిస్తారని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది. కాగా ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. దేశీయ విమానయానరంగంలో 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది.