సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:40 IST)

కొత్త యేడాదిలో మోత మోగనున్న కార్ల ధరలు...

కొత్త సంవత్సరంలోకి మరో తొమ్మిది రోజుల్లో అడుగుపెట్టనున్నాం. ఈ కొత్త యేడాదిలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు.. కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోనున్నాయి. దీనికి కారణం ఉక్కు, ప్లాస్టిక్, ఇతర నిర్మాణ వ్యయాలు పెరగడంతో తయారీ కంపెనీలు వీటి ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఇప్పటికే మహీంద్రా, రెనో, హీరో మోటోకార్ప్, మారుతిసుజుకి, ఫోర్డ్ వంటి వాహన తయారీ సంస్థలు జనవరి 1 నుంచి తమ వాహన మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్, ఇసుజు సంస్థలు కూడా వాణిజ్యపరమైన వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించుకున్నాయి.
 
ఉత్పత్తి వ్యయం అధికం కావడమే కాకుండా, బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తయారు చేయాల్సిరావడం ఆర్థికంగా ప్రయాసభరితమని టాటా మోటార్స్ వెల్లడించింది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ జనవరి 4 నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. 
 
బీఎండబ్ల్యూతో పాటు అనుబంధ బ్రాండ్లపై 2 శాతం పెంపు ఉంటుందని తెలిపింది. పికప్ వాహనాలకు పెట్టింది పేరైన ఇసుజు సంస్థ మోడళ్లను బట్టి రూ.10 వేల మేర ధరల పెంచాలని నిర్ణయించింది. ఇసుజు ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.