శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (15:17 IST)

మధ్యంతర బడ్జెట్ : వివిధ శాఖలకు నిధుల కేటాయింపులు..

budget allocations
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌‍సభలో 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివిధ శాఖలకు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్‌‍లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66 లక్షల కోట్లుగా కాగా, వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే, 
 
దేశంలో మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు, రక్షణశాఖకు రూ.6.2 లక్షల కోట్లు, రైల్వేశాఖకు రూ.2.55 లక్షల కోట్లు, హోంశాఖకు రూ.2.03 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77 లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78 లక్షల కోట్లు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37 లక్షల కోట్లు, గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేల కోట్లు, ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి రూ.7500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200 కోట్లు, సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు, సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8500 కోట్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌కు రూ.600 కోట్లు చొప్పున కేటాయించారు. 
 
యువ భారత్ ఆకాంక్షలకు ప్రతిబింభం ఈ బడ్జెట్ : ప్రధాని మోడీ 
 
లోక్‌సభలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక మధ్యంతర బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, ఇది దేశాభివృద్ధి కొనసాగింపునకు ఎంతో విశ్వాసాన్నిచ్చిందని తెలిపారు. 
 
'సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇది. దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించింది. వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీ ఇచ్చింది. ఇది యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింభం. 
 
సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటుచేశాం. అలాగే బడ్జెట్‌లో చెప్పిన మూలధన వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం గురించి ప్రకటించాం.
 
మహిళలను లక్షాధికారుల్ని చేసే పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నాం. ఆయుష్మాన్ భారత్‌ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారు. సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ ఉద్దేశం' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.