గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 జులై 2021 (12:24 IST)

వంటకం మీది... వంటగది మాది... !!

క్లౌడ్‌ కిచెన్‌... ఇప్పుడు రెస్టారెంట్‌, హోటల్‌ సర్కిల్స్‌లో అధికంగా వినిపిస్తున్న పదం. కొంతమంది డార్క్‌ కిచెన్‌, ఘోస్ట్‌ కిచెన్‌ అంటుంటే ఇంకొంత మంది వర్ట్యువల్‌ కిచెన్స్‌, శాటిలైట్‌ కిచెన్స్‌ అని కూడా అంటున్నారు. పలికేది ఏ విధంగా ఉన్నా వీటన్నిటిలోనూ ఉండే ఒకే ఒక్క లక్షణం...

ఎలాంటి డైన్‌ ఇన్‌ సదుపాయం లేకుండా డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా మెలగడమే! ప్రస్తుత కాలంలో వ్యాపారం కాపాడుకోవడానికి ఉన్న అవకాశంగా చాలామంది క్లౌడ్‌ కిచెన్‌ను భావిస్తున్నారు. ఆతిథ్య రంగాన్ని కరోనా కకావికలం చేసిన కాలంలో ఖర్చులు తగ్గించుకుని కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే క్లౌడ్‌ కిచెన్‌ ఒక్కటే మార్గమంటున్నారు ఆతిథ్య రంగంలోని ఔత్సాహికులు.

కానీ, ఆన్‌లైన్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌పై రెస్టారెంట్‌ను లిస్ట్‌ చేసుకున్నంత సులభంగా కిచెన్‌ ఏర్పాటుచేయలేము కదా ! మరీముఖ్యంగా కరోనా పేరిట మౌలిక వసతుల ఖర్చులు విపరీతంగా పెరిగినకాలంలో !! ఇదిగో ఇక్కడే తాము సహాయం చేస్తామంటూ ముందు కొస్తున్నాయి కొన్ని సంస్థలు. వంటకం మీది... వంటగది మాది, పేరు మీది... మీ తరపున వినియోగదారులకు అందించేది తాము అంటూ వినూత్న నేపథ్యంతో నగరవాసుల ముంగిటకొచ్చింది డెలీ 360.

క్లౌడ్‌ కిచెన్‌... కాదు కాదు అంతకు మించి అంటూ అటు బీ2బీ వినియోగదారులతో పాటుగా ఇటు బీ2సీ వినియోగదారులకూ సేవలనందిస్తుంది. క్లౌడ్‌ కిచెన్‌ అంటే డైన్‌ ఇన్‌ సదుపాయాలు ఉండవు, కానీ తాము ఆ సేవలను కూడా అందిస్తామంటూ సరికొత్త పంథా అనుసరిస్తుంది.
కరోనా కష్టాలకు చెక్‌... ఔత్సాహిక ఫుడీలకు ఫన్‌...
కోవిడ్‌-19 అందరికీ కష్టాలనే తీసుకువచ్చింది. ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. హోటల్‌ రంగ పరిస్థితి మరీ దారుణం. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 30%కు పైగా రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయని  హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేస్తుంది. సుప్రసిద్ధ రెస్టారెంట్‌ చైన్స్‌ కూడా నిర్వహణ ఖర్చుల భారంతో సతమతమవుతున్నాయి. ఇదే  క్లౌడ్‌ కిచెన్‌లకు మార్గం సుగమం చేస్తుంది.

2019 నాటికి దేశంలో 5వేలకు పైగా క్లౌడ్‌ కిచెన్‌లు ఉన్నాయని , ప్రస్తుతం 50–60% వృద్ధిని నమోదు చేస్తున్నాయని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ అంటుంటే, గ్రాస్‌ మర్చండైజ్‌ విలువ పరంగా 2019లో 400 మిలియన్‌ డాలర్లు ఉంటే 2024 నాటికి 3బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా ఇది నిలువనుందనీ అంచనా వేస్తున్నాయి మరికొన్ని సంస్థలు. ఎఫ్‌ అండ్‌ బీ రంగంలో రాబోయేదంతా క్లౌడ్‌ కిచెన్‌ కాలమేనంటూ కూడా చెబుతున్నారు ఈ రంగ ప్రముఖులు. అంతేకాదు, ఈ తరహా కిచెన్‌ల ఏర్పాటులో కొంతమంది తలమునకలయ్యారు కూడా!

అయితే ప్రస్తుత పరిస్థితిల్లో ఎఫ్‌ అండ్‌ బీ రంగంలో రాణించాలంటే  భారీ పెట్టుబడులు పెట్టడం కన్నా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని బ్రాండ్‌ను నిర్మించుకోవడమే బెటర్‌  అని అంటున్నారు డెలీ 360 ఫౌండర్‌ శివ తేజేశ్వర్‌ రెడ్డి. ఆయనే మాట్లాడుతూ తమ డెలీ 360ను బీ2బీకి సైతం సహాయపడే రీతిలో తీర్చిదిద్దాం. మీ సొంత బ్రాండ్‌ను మీరు సృష్టించుకోవచ్చు. అదే సమయంలో మా కిచెన్‌ సేవలను వినియోగించుకోచ్చు. ఫుడ్‌ డెలివరీ కోసం మా డెలివరీ ప్లాట్‌ఫామ్‌నూ వినియోగించుకోవచ్చంటున్నారు. కాన్సెప్ట్‌ ఏదైనా అందుకనువైన కిచెన్‌ సేవలను తామందించగలమని చెబుతూ తమ క్లౌడ్‌ కిచెన్‌తో మార్కెటింగ్‌ అవకాశాలనూ  అధికంగా అందిస్తున్నామంటున్నారు.
 
ఈ విషయాన్నే మరింత వివరంగా శివ చెబుతూ రెస్టారెంట్ల సిగ్నేచర్‌ రెసిపీలను కూడా ఔట్‌ సోర్సింగ్‌ చేస్తున్నాం. ఆ రెస్టారెంట్‌ల తరపున మేము వండినప్పటికీ రుచి పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే, మా చెఫ్‌లు పూర్తి సుశిక్షితులు. వంటకాలలో వాడే పదార్థాల సేకరణ, ఆ వంటకాల తయారీలో వాటిని వాడే విధానం అంతా అసలైన రెస్టారెంట్‌ను అనుసరించే ఉంటుండటం వల్ల రుచి, నాణ్యత పరంగా ఎలాంటి భయమూ ఉండదన్నారు.
 
కేవలం వ్యాపార వర్గాలకు మాత్రమే కాదు వినియోగదారులకూ వినూత్న అవకాశాలను అందిస్తుంది డెలీ 360.  మీరు కోరుకోండి... మేము వండి వడ్డిస్తామంటూ ఆఫర్‌ చేస్తుంది. రుచి, నాణ్యత పరంగా మాత్రమే కాదు విభిన్న వంటకాలనూ రుచి చూపిస్తున్నామంటున్నారు శివ. ఇండియన్‌, చైనీస్‌, కాంటినెంటల్‌, దక్షిణ భారత, అరేబియన్‌, ఓరియెంటల్‌ రుచులను ఆఫర్‌ చేస్తున్న డెలీ, క్లౌడ్‌ కిచెన్‌లో సరికొత్త నేపథ్యాలనూ పరిచయం చేసింది. వినియోగదారులు తమ ఆహార ప్రాధాన్యతలకనుగుణంగా మీల్‌ ప్లాన్‌ ఎంచుకోవడమే కాకుండా, కోరుకున్న సమయానికి డెలివరీ పొందే అవకాశమూ అందిస్తున్నామంటూ డెలీ 360 యాప్‌ ద్వారా తాము ఈ సేవలనందిస్తున్నామన్నారు.