185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 185 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి ఈ నెల 28, మార్చి 1 తేదీల్లో వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21, 23, 26 తేదీల్లో నిర్వహించాలనుకున్న వాకిన్ రిక్రూట్మెంట్‌కు బదులు ఈ నెల 28, మార్సి 1 తేదీల్లో నిర్వహిస్తామని, అనివార్య కారణాల వల్ల వాకిన్ రిక్రూట్మెంట్ తేదీలను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రెగ్యులర్, కాంట్రాక్ట్, కొటేషన్ పద్ధతిలో పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ , 77-2-జి, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, పాతూర్ రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా చిరునామాలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్ కు అర్హత గల అభ్యర్థలు స్వయంగా హాజరుకావాలని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతర నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్ విభాగాలకు ఈ నెల 28న, గైనకాలజీ, పిడియాట్రిక్స్, అనెస్థీషియా, ఇఎన్ టి, అఫ్తాల్మలాజీ, పథాలజీ విభాగాలకు మార్చ్ ఒకటో తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/ మరియు https://hmfw.ap.gov.in వెబ్సైట్లను చూడొచ్చని శ్రీనివాసరావు తెలిపారు.